రేపు సింహగిరిపై సంక్రాంతి సంబరాలు
సింహగిరిపై ఏర్పాటు చేస్తున్న పూరిళ్లు
సింహాచలం: సింహగిరిపై బుధవారం ఉదయం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మాన్ని, తెలుగు సంస్కృతిని, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో ఉదయం పెద్ద ఎత్తున భోగి మంటను వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గొబ్బెమ్మలతో ముత్యాల ముగ్గులు, డూడూ బసవన్నల విన్యాసాలు, జంగమ దేవర, కొమ్మదాసరి, హరిదాసు వేషధారణలు, కపిలగోవు, కపిలగిత్త, ఎడ్లబండి, పూరిగుడెసలు, ధాన్యం గుట్టలను ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు చిన్నారులకు సామూహికంగా భోగిపళ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే ముంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు.


