జీవీఎంసీ బడ్జెట్‌కు స్థాయీ సంఘం ఆమోదం | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ బడ్జెట్‌కు స్థాయీ సంఘం ఆమోదం

Jan 13 2026 5:57 AM | Updated on Jan 13 2026 5:57 AM

జీవీఎంసీ బడ్జెట్‌కు స్థాయీ సంఘం ఆమోదం

జీవీఎంసీ బడ్జెట్‌కు స్థాయీ సంఘం ఆమోదం

ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు

అన్ని పద్దుల కింద జమలు రూ.3,814.41 కోట్లు

ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు రూ.4,180.37 కోట్లు

అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4,047.12 కోట్లు

ముగింపు నిల్వ రూ.133.25 కోట్లు

డాబాగార్డెన్స్‌(విశాఖ): జీవీఎంసీ 2026–27 బడ్జెట్‌ అంచనాలపై స్థాయీ సంఘ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారని నగర మేయర్‌, స్థాయీ సంఘం చైర్మన్‌ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ వార్షిక బడ్జెట్‌పై స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఏ విభాగానికి ఎంత వెచ్చించారు? జమలు, ఖర్చులు, వివిధ అభివృద్ధి పనులకు ఎంత కేటాయించారో? తదితర అంశాలను సభ్యుల ముందుకు జీవీఎంసీ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి తీసుకొచ్చారు. వాటిని స్థాయీ సంఘ సభ్యులు చర్చించి ఆమోదించారు. వాటిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి త్వరలో జరగనున్న కౌన్సిల్‌ సమావేశంలో సభ్యుల ఆమోదానికి పంపనున్నారు. కాగా మేయర్‌ పీలాకు ఇదే మొదటి బడ్జెట కాగా.. చివరి బడ్జెట్‌ కూడా ఇదే కావడం విశేషం. ఐదేళ్ల పాలనలో నాలుగేళ్లు వైఎస్సార్‌ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌గా బడ్జెట్‌ ఆమోదించారు.

సమావేశంలో అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, డి.వి.రమణమూర్తి, ఎస్‌.ఎస్‌.వర్మ, పి.నల్లనయ్య, చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ ఈ.ఎన్‌.వి.నరేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్‌ ఇలా..

2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనా సంగ్రహంగా ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు. అన్ని పద్దుల కింద జమలు రూ.3814.41 కోట్లు. ప్రారంభ నిల్వతో కలిపి మొత్తంగా జమలు రూ.4180.37 కోట్లు కాగా.. అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4047.12 కోట్లు. ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లుగా నిర్ణయించారు.

గారడీ అంకెలంటే ఒప్పుకునేది లేదు..

బడ్జెట్‌ను స్థాయీ సంఘ సభ్యుల ముందుకు చర్చకు తెచ్చే ముందు మేయర్‌ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో గారడీ అంకెలు చూపించారని తెలపడంతో స్థాయీ సంఘ సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందిస్తూ.. ‘మీరు ఆ విధంగా మాట్లాడడం సరికాదు. బడ్జెట్‌ను ఎవరు రూపొందిస్తారు.. అధికారులా? సభ్యులా? గతంలో 98 వార్డుల్లో అభివృద్ధి జరగలేదా? మీ వార్డు ఏ మేరకు అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా’? అంటూ మండిపడ్డారు.

● గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి తదితర విలీన ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్‌ స్కూల్స్‌ కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని జీవీఎంసీ పరంగా మనం అభివృద్ధి చేయలేమా? అంటూ సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు ప్రశ్నించారు.

● జీవీఎంసీ పరిధిలో పార్కులు, శ్మశానవాటికలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు. అంత వరకూ బాగానే ఉంది. వాటిని సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారని, సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు అధికారుల ముందుకు తీసుకొచ్చారు. కేర్‌ టేకర్స్‌ని నియమిస్తే వాటి సంరక్షణ ఉంటుందని సూచించారు.

● బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణలో చాలా చోట్ల బస్టాప్‌లు కోల్పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకోచ్చారు.

● విలీన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో జీవీవీంసీ పూర్తిగా విఫలమైందని, ఇప్పటికీ మట్టి రోడ్లే ఉన్నాయని సభ్యురాలు సేనాపతి వసంత ఆవేదన వ్యక్తం చేశారు.

సమావేశంలో స్థాయీ సంఘ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement