కో..అంటే కాసులే..!
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో కోడి పందేలు, జూద క్రీడలు జోరుగా జరుగుతున్నాయి. గ్రామ జాతరలు, తీర్థాలు పేరిట అధికారం అండతో కూటమి నేతలు జూదాలు, కోడి పందాలు, పొట్టేలు పందాలు, గుండాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. జిల్లాలో యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నర్సీపట్నం, కోటవురట్ల గొలుగొండ, నాతవరం, రోలుగుంట, బుచ్చెయ్యపేట, మాడుగల, దేవరపల్లి మండలాల్లో గ్రామ జాతరలు, తీర్థాల పేరిట కోడి పందాలు, లాటరీ, జూదం,పేకాట, గుండాటతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వాటిని నిలువరించాల్సిన పోలీసులే వారితో కుమ్మక్కై వెనకుండి నడిపిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కోడి పందాలు, పేకాట, గుండాట, లాటరీ గేమ్‌లకు ఒక్క రోజుకు గానూ రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకూ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం రాంబిల్లి మండలంలో వాడనర్సాపురంలో అభయాంజనేయ స్వామి తీర్థంలో అనధికారికంగా జూద క్రీడలు నిర్వహించారు. వీటి నిర్వహణ కోసం పోలీసులకు భారీగానే మామూళ్లు ముట్టచెప్పినట్టు సమాచారం. స్థానిక కూటమి నేతలే కోడి పందాలు, ఇతర జూద క్రీడలను నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేందుకు సుమారు రూ. లక్ష వరకు మామూళ్లు ఇచ్చినట్టు భోగట్టా.
జాతరల్లో విస్తృతంగా కోడి పందాలు..
ఈ నెల 09వ తేదీన ఆదివారం రాంబిల్లి మండలంలో వాడ నర్సాపురం, యలమంచిలి నియోజకవర్గంలో ఏటికొప్పాక గ్రామ జాతరలో విచ్చలవిడిగా కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహించారు. అచ్యుతాపురం మండలంలో ఎదురవాడ, నునపర్తి, జగన్నాథపురం, యర్రవరం గ్రామంలో, మడుతూరు గ్రామాల్లో, యలమంచిలి మండలంలో యర్రవరం గ్రామంలో, రాంబిల్లి మండలంలో మామిడాడ కొత్తూరు గ్రామంలో, మునగపాక గ్రామంలో నిర్వహించిన గ్రామ జాతరల్లో కూడా కోడి పందాలు, లాటరీ, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించారు. అదేవిధంగా దసరాకు అచ్యుతాపురం మండలంలో హరిపాలం గ్రామంలో, మాఘపౌర్ణమి నాడు పూడిమడక గ్రామంలో పొట్టేలు పందేలు, కోడి పందాలు, జూద క్రీడలు జరిగాయి. యలమంచిలి మండలంలో జంపపాలెం, సోమలింగపాలెం గ్రామంలో నిత్యం పేకాట, గుళ్లాట తరుచూ జరుగుతూనే ఉండడం గమనార్హం.
కూటమి నేతల జూద క్రీడలు..
పలు గ్రామాల్లో
అనధికారంగా కోడి పందాలు
వాడనర్సాపురం తీర్థం, ఏటికొప్పాక
గ్రామ జాతరలో భారీగా పందేలు
రూ.లక్షల్లో చేతులు మారినట్టు సమాచారం
అంతా.. పోలీసుల కనుసన్నల్లోనే
అని ఆరోపణలు


