భగవద్గీతతో జీవిత సమస్యలకు పరిష్కారం
మురళీనగర్ (విశాఖ): ప్రతి రోజూ భగవద్గీత పఠనం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఎన్‌జీజీవోస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేశారు. చిన్న పిల్లలు భగవద్గీత చదివితే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. జ్యోతిష్యం, ఆగమ శాస్త్రాలను తప్పక గౌరవించాలని సూచించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వల్ల పుణ్యం కలుగుతుందని పిలుపునిచ్చారు. మనసును నిగ్రహంగా ఉంచుకోవడానికి విగ్రహారాధన చేయాలని తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులు, ఈవో బి.ప్రసాద్ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీ వైభవుడిని దర్శించుకుని పూజలు చేసి, అంతరాలయంలో కాసేపు ధ్యానం చేశారు. బీజేపీ నేత శ్యామలాదీపిక, అర్చకులు శేషాచార్యులు, వాసుదేవాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.


