ఇరిగేషన్‌లో ఇంజినీర్ల కొరత
సాక్షి, అనకాపల్లి: ఇరిగేషన్ ప్రొజెక్టులపై చంద్రబాబు సర్కార్ అడుగు అడుగునా నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోంది. పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమించలేదు. సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు ఎస్‌ఈ పోస్టులకు మూడు ఎస్‌ఈ, ఒక సీఈల్లోనూ ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. తుఫాన్ సమయంలో రిజర్వాయర్లలో నీరు చేరి గేట్లు ఎత్తివేయడంలో అనుమతులు రాకపోవడంతో జేఈలు, డీఈలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. రిజర్వాయర్ నీటిమట్టం, నదుల ద్వారా ప్రవహించే నీరు, గట్లు పరిస్థితులపై ఇన్‌చార్జి అధికారులకు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, నిర్ణయాధికారం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జిల్లాల పునర్విభజన జరిగినా...
జిల్లాల పునఃవిభజన జరిగినా ఇరిగేషన్ విభాగంలో ఉమ్మడి విశాఖ జిల్లాలకు ఒక్కరే ఎస్‌ఈ ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే మూడు జిల్లాలకు ఈఈలను ఆయా జిల్లాల ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి, అల్లూరి జిల్లాలో ఇరిగేషన్ విభాగం అత్యంత ప్రాధానమైంది. అలాంటి జిల్లాల్లో కూడా అరకొరగానే ఇంజినీర్లు ఉన్నారు. విశాఖ సర్కిల్ ఇన్‌చార్జి ఎస్‌ఈగా ఈఈ పి.అప్పలనాయుడు కొనసాగుతున్నారు. అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జిగా ఈఈ త్రీనాథ్(డబ్లూఎస్‌ఎం) కొనసాగుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఇరిగేషన్ ప్రధాన విభాగాన్ని నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న డీఈ బాలసూర్యమే అక్కడ ఈఈ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఇద్దరు ఈఈలు ఉన్నారు. విశాఖకు ఈఈ పోస్టు ఖాళీగా ఉంది.
సీఈగా కూడా ఇన్‌చార్జినే..
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో కీలకమైన నార్త్ కోస్టు సీఈ పోస్టు కూడా ఇన్‌చార్జిలతో నడుస్తోంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐదు ఎస్‌ఈ పోస్టుల్లో ఒక వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ ఒక్కరే రెగ్యులర్‌గా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లాలో ఇరిగేషన్ శాఖలో, ఇక ఉమ్మడి విశాఖలో జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కరువయ్యారు. నాలుగు డివిజన్‌లకు ఒకే ఒక్క ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉన్నారు. దాదాపు అన్ని ఎస్‌ఈ, ఈఈ పోస్టులు ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి. మిగిలిన డివిజన్‌ల్లో, సబ్ డివిజన్లలో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లేక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్(డీఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్లు(ఏఈ)లతో జలవనరుల శాఖ నడుస్తోంది. ఇక అసిస్టెంటు ఇంజినీరు(ఏఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈఈ) పోస్టుల కొరత కూడా విపరీతంగా ఉంది. ప్రస్తుతం డీఈఈలు, ఏఈలు అనేక పోస్టుల్లో ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్నారు.
పదోన్నతులు, పోస్టింగుల్లో తీవ్ర అన్యాయం
జలవనరుల శాఖలో ఇటీవల ఇచ్చిన పదోన్నతులు, పోస్టింగుల్లో కూడా ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. జలవనరుల శాఖలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో అన్ని ఎస్‌ఈలు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఈఈ) పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీ ఉంటున్నాయి. విశాఖ జిల్లా ఎస్‌ఈ పోస్టులో ధవళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్‌ఈని ఇక్కడ ఇన్‌చార్జీగా కొంత కాలం నియమించారు. ప్రస్తుతం ఈఈనే ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఎంతో మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్నారు. కానీ ఏదో చిన్న సాకుతో పదోన్నతులు ఇవ్వడం లేదు. అలాగే అందువల్ల ఇక్కడ పనిచేస్తున్న వారికి ఇటీవల ఇచ్చిన పోస్టింగుల్లో కూడా ప్రాధాన్యం లేదు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ఇక్కడ నియమించి వారికి పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు కూడ ఉన్నాయి. అంతేకాకుండా ప్రాజెక్టు నిర్వహణకు నిధులు జిల్లాలో కీలకమైన రిజర్వాయర్లు అన్నీ ఎస్‌ఈ పరిధిలో ఉంటాయి. అనకాపల్లి జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు, కళ్యాణపులోవ మేజర్, మైనర్ సాగునీటి ప్రాజెక్టులుగా ఉన్నాయి. వాటి పర్యవేక్షణ అంతా ఎస్‌ఈలే నిర్ణయాధికారంగా ఉంటుంది.
ఉత్తరాంధ్రలో 3 ఎస్‌ఈ,
ఒక సీఈ పోస్టుల్లో ఇన్‌చార్జిలే
ఉమ్మడి విశాఖకూ ఇన్‌చార్జి ఎస్‌ఈ
ఈఈలు, డీఈఈలు కూడా సర్దుబాట్లే
నీటి పారుదల శాఖ పట్ల
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం
కళ తప్పిన సూపరింటెండెంట్
కార్యాలయ ప్రాంగణాలు


