అర్జీలపై క్షేత్ర స్థాయి పర్యటన తప్పనిసరి
● అధికారులకు జేసీ జాహ్నవి ఆదేశం
● పీజీఆర్‌ఎస్‌కు 239 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అర్జీలు స్వీకరిస్తున్న జేసీ జాహ్నవి, జిల్లా అధికారులు
తుమ్మపాల: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలపై సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని జేసీ ఎం.జాహ్నవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు పీజీఆర్‌ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలు వివరంగా తెలియజేసి, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. అర్జీల సమాచారం కోసం దరఖాస్తుదారులు 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 239 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, జిల్లా సర్వే, భూ రికార్డుల భద్రత సహాయ సంచాలకుడు గోపాల రాజా, తదితరులు పాల్గొన్నారు.
బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేసి ప్రజల జీవితాలను కాపాడాలని కోరుతూ నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. మత్స్యకారులకు జీవనాధారంగా ఉన్న మత్స్య సంపద పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారి–16 ఆనుకుని యలమంచిలి పరిసరాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యలమంచిలి మండలం కొత్తపాలెంకు చెందిన ఆడారి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. మండలంలో మర్రిబంద, రేగుపాలెం, పులపర్తి, పురుషోత్తపురం, తదితర ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులు నెలవారీ మామ్ముళ్ల మత్తులో నిద్రిస్తున్నారని, ప్రత్యేక పోలీస్ బృందంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఆటో సేవా పథకం కింద అందాల్సిన నగదు నేటికి తనకు జమ కాలేదని చీడికాడ మండలం ిసిరిజాం గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఆవాల వెంకటరమణ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. పదేళ్లుగా ఆటో డ్రైవర్‌గా ఉన్నానని, ఆటో విక్రయించి ట్యాక్సీ క్యాబ్ నిర్వహిస్తున్నానని, సచివాలయంలో అన్ని పత్రాలు సమర్పించినా నగదు జమ కాలేదని వాపోయారు. తక్షణం పథకం డబ్బులు మంజూరు చేయాలని కోరారు.
భూసమస్యపై అర్జీ అందజేసి ఏడాది పూర్తవుతున్నా అధికారులు కనీసం స్పందించలేదని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు భీశెట్టి అప్పారావు పీజీఆర్‌ఎస్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. కోడూరు సర్వే నెం.324/2, 329/1,2లో మొత్తం 2.20 ఎకరాల భూమి తన భార్య జానకికి వారసత్వంగా వచ్చిందని, రెవెన్యూ అధికారులు పట్టణానికి చెందిన బొడాల సత్యనారాయణ, బొడాల శ్రీనుబాబు, రమణబాబుల పేరున తప్పుగా ఆన్‌లైన్ చేశారని, వాటిని తొలగించి తమ పేరున ఆన్‌లైన్ చేయాలని కోరారు.
ఎస్పీ కార్యాలయానికి 50 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 50 అర్జీలు అందాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సమస్యలను ఎస్పీ తుహిన్‌సిన్హాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. భూ తగాదాలు – 19, కుటుంబ కలహాలు – 2, మోసానికి సంబంధించిన – 2, ఇతర విభాగాలకు చెందినవి – 27 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీలపై క్షేత్ర స్థాయి పర్యటన తప్పనిసరి


