‘ఆశ’లు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
● ముగిసిన ఆశ వర్కర్ల రాష్ట్ర మహాసభలు
● ఉద్యోగ భద్రత, కనీస వేతనాల
అమలు కోసం భవిష్యత్తు
పోరాటాలకు పిలుపు
అనకాపల్లి: ప్రభుత్వాలు మారిన రాష్ట్రంలో ఆశ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి అన్నారు. స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్నహైస్కూల్ ఎదురుగా కర్రి రమేష్ కల్యాణ మండపంలో యూనియర్ రాష్ట్ర 5వ మహాసభ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్ల పై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని ఈ మహాసభల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ను ఆశా వర్కర్లుగా గుర్తించాలని, ఆశ వర్కర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన అంశాలపై జీవోలు విడుదల చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో మహిళలు పనిచేసే విధంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. రాజకీయ వేధింపులు, తొలగింపులు అనేక జిల్లాల్లో జరుగుతున్నాయని వీటిపై కూడా ఉద్యమించాల్సి వస్తుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడుతున్న ఉద్యోగులు, కార్మికులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి పెట్టుబడిదారుల సేవలో మునిగి తేలుతున్నాయని అన్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ అనకాపల్లి జిల్లాలో మరో ప్రైవేటు స్టీల్ ప్లాంట్‌ను తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు. కార్మికులను ఎనిమిది గంటల పనిని 13 గంటలకు పెంచి శ్రమదోపిడీకి దారులు వేస్తున్నారని, చికాగో పోరాట స్ఫూర్తిని అపహాస్యం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావు , ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఐదో మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.మాణిక్యం, డీడీ వరలక్ష్మి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె.పోచమ్మ, పి ధనశ్రీ, వి.సత్యవతి, డి.సుధారాణి, పి.మణి, డి.జ్యోతి, కమల, అమర, సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు, ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్ పాల్గొన్నారు.
‘ఆశ’లు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం


