భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలి
మహారాణిపేట (విశాఖ): ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్‌తో కలిసి ఆదివారం ఈ పనులను పరిశీలించిన ఆయన, వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున, అధికారులు సమన్వయం వహించుకుని, నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రధాన వేదిక, స్వాగత ద్వారాలు, అతిథుల రాక, పార్కింగ్ వసతి వంటి అంశాలపై ఆయన సూక్ష్మ స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చేయాల్సిన పనులపై ఆయన అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడా గ్యాప్ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే జీవీఎంసీ సీఈకి పలు అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై, మార్పులు చేర్పులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీసీపీ మణికంఠ చందోలు, జీవీఎంసీ సీఈ సత్యనారాయణరాజు, సీఎంవో డాక్టర్ నరేష్ కుమార్, సీఐఐ ప్రతినిధి మౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


