అరటి తోటలు ధ్వంసం
వర్ష బీభత్సం..
తిమిరాంలో విరిగిన అగర్‌వుడ్ మొక్కలు
దేవరాపల్లి: జిల్లాలో రెండు రోజులుగా పెనుగాలులతో కురిసిన వర్షాలకు అరటితోటలు ధ్వంసమయ్యాయి. దేవరాపల్లి మండలంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి. భారీగా వీచిన ఈదురు గాలుల ధాటికి తిమిరాం గ్రామానికి చెందిన రెడ్డి సింహాద్రప్పడు, కామిరెడ్డి శ్రీరామమూర్తి, రెడ్డి సత్యనారాయణ తదితరులకు చెందిన సుమారు 8 ఎకరాలలో ఏడేళ్ల క్రితం అగర్‌వుడ్ సాగు చేస్తున్నారు. దీనిలో అంతర పంటగా కడియం నుంచి తీసుకువచ్చిన అరటి మొక్కలు నాటారు. అరటి తోట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో లాభాలు వస్తాయని ఆశపడిన రైతులకు అకాల వర్షాలు నిరాశ మిగిల్చాయి. ఈ నెల నుంచి అరటి గెలల విక్రయాలు ద్వారా వారానికి రూ.5వేలు పైగా ఆదాయం వచ్చేది. గురువారం సాయంత్రం ఈదురుగాలుల ధాటికి అరటి తోటతో పాటు ఏడేళ్లుగా కష్టపడి పెంచిన అగర్‌వుడ్ చెట్లు సైతం విరిగిపోయాయి. ఐదెకరాల్లో అరటి తోట, సుమారు 1500 వరకు అగర్‌వుడ్ మొక్కలు నేల కూలాయని బాధిత రైతు రెడ్డి సింహాద్రప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 ఎకరాలలో సాగు చేసిన అరటి, అగర్‌వుడ్ తోటలు ధ్వంసమయ్యాయని రైతు కామిరెడ్డి శ్రీరాములు తెలిపారు. మరో రైతు రెడ్డి సత్యనారాయణకు చెందిన 50 సెంట్లలో అరటి తోట ధ్వంసమైంది. ప్రభుత్వం వెంటనే ఆదుకొని పంట నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు. రైతుల సమాచారం మేరకు నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించామని మామిడిపల్లి సచివాలయ వ్యవసాయ సహాయకురాలు రామలక్ష్మి తెలిపారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.
రైతులపై ప్రకృతి కన్నెర్ర
నాతవరం: ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి జీడి మామిడి తోటలతో పాటు అరటి తోటలకు తీవ్ర నష్టం కలిగింది. మండలంలో గురువారం రాత్రి ఈదురు గాలులతో పాటు భారీ వర్షం పడడంతో జీడి పిక్కలు, మామిడి కాయలు చాలా చోట్ల నేలకొరిగాయి. చమ్మచింత, వల్సంపేట, మాధవనగరం, నాతవరం, గుమ్మడిగొండ, వెదురుపల్లి, సరుగుడు, పెదగొలుగొండపేట, చినగొలుగొండపేట గ్రామాల్లో రైతులు అరటి తోటలు సాగు చేస్తున్నారు. అరటి తోటలు కాపు ముమ్మరంగా కాసి ప్రస్తుతం విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. పంట చేతికంది వచ్చే సమయంలో అరటి రైతులపై ప్రకృతి కన్రెర్ర చేయడంతో అరటి చెట్ల నేలమట్టమయ్యాయి. మండల వ్యాప్తంగా సుమారుగా 10 ఎకరాలకు పైగా అరటి తోటలు ఈదురు గాలలకు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. చాలా గ్రామాల్లో రైతులు పామాయిల్ తోటలో అంతర పంటగా అరటి తోటలు పెంచుతున్నారు. గాలులకు దెబ్బతిన్న అరటి తోటలను శుక్రవారం ఆయా గ్రామాల రైతులు ఉద్యావన వ్యవసాయశాఖాధికారులను తీసుకెళ్లి స్వయంగా చూపించారు. అరటి తోట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న తోటలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని నాతవరం గ్రామ సచివాలయ ఉద్యాన వనశాఖాధికారి రవితేజ తెలిపారు.


