గ్రూపు రాజకీయం చేస్తే.. ఎమ్మెల్యేపై కూడా చర్యలు
బుచ్చెయ్యపేట: వ్యక్తిగత ఇమేజ్ కోసం తన ఉనికిని కాపాడుకోవడానికి పలు పార్టీలు మారే అవకాశవాదులు గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు. ఇటీవల బుచ్చె య్యపేటలో చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు మండల టీడీపీ కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేసి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకపోవడమే కాక ఫ్లెక్సీలో తన ఫొటో వేయకపోవడంపై తాతయ్యబాబు స్పందించారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన శనివారం తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ ఫ్లెక్సీలో పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న తన పేరును, ఫొటోను వేయకపోవడం ప్రొటోకాల్‌కు విరుద్ధమన్నారు. కొంతమంది ఎన్నికల ముందు పార్టీలు మారి గెలిచిన పార్టీలో చేరి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వారి ఆటలు సాగనీయబోమని, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగనీయమన్నారు. గ్రూపు రాజకీయాలు చేస్తే ఎమ్మెల్యేలపైన కూడా చర్యలు తీసుకునేలా అధిష్టానం దృష్టికి తీసికెళ్తామన్నారు. ప్రతి బుధవారం ఎమ్మెల్యే తన పరిధిలోని మండల కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహించి ఉదయం ప్రజల సమస్యలు, మధ్యాహ్నం పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ నిర్వహించకుండా ప్రజా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకొని అధిష్టానానికి సమాచారం అందిస్తున్నామన్నారు. నాయకులు దొండా నరేష్, సయ్యపురెడ్డి మాధవరావు, మేడివాడ రమణ, శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, గురుమూర్తి, శంకరరావు తదితర్లు పాల్గొన్నారు.
గీత దాటితే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా
ప్రతి బుధవారం గ్రీవెన్స్ నిర్వహించకపోతే ఎమ్మెల్యేలను వివరణ కోరతాం
ప్రొటోకాల్ రగడపై స్పందించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు


