దేశాభివృద్ధిలో సముద్ర రంగం కీలకం
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ వాణిజ్యంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధిలో సముద్ర రంగం ముఖ్య భూమిక పోషిస్తోందని విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) చైర్మన్ డా. ఎం. అంగముత్తు అన్నారు. 62వ నేషనల్ మేరీటైమ్ దినోత్సవం పోర్టులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ డా. ఎం. అంగముత్తు, సముద్రరంగంలో విధులు నిర్వర్తించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. అనంతరం పోర్ట్ టగ్ ఫ్లోటిల్లా ఇచ్చిన గౌరవ వందనం స్వీకరించారు. చైర్మన్ మాట్లాడుతూ.. నౌకాయాన, సముద్ర రవాణా రంగాలు దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయికి సామర్థ్యాన్ని పెంపొందించడంలో విశాఖపట్నం పోర్ట్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మేరీటైమ్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, కోస్ట్‌గార్డ్ డీఐజీ రాజేశ్ మిత్తల్, హెచ్‌ఐఎంటీ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్‌తో పాటు పోర్ట్ విభాగాధిపతులు, సీనియర్ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.


