22న రమాకుమారిపై అవిశ్వాసం
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపాలిటీలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ నుంచి 25 మంది వార్డు సభ్యులకు అధికారికంగా సమాచారం వచ్చింది. పురపాలకసంఘానికి 2021లో జరిగిన ఎన్నికల్లో 25 వార్డులకు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ఒకరు, మరొక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినవారిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాలతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి ఎన్నికయ్యారు. ఇటీవల పిల్లా రమాకుమారి బీజేపీలో చేరారు. దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్లు రమాకుమారిపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టరుకు నోటీసు ఇచ్చారు. నిర్దేశిత ఫార్మాట్‌లో ఇచ్చిన నోటీసు పరిశీలించిన కలెక్టర్ విజయ కృష్ణన్ ఈ నెల 22వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రక్రియకు సంబంధించి కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు స్థానిక మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ సభ్యులకు ప్రలోభాలు!
మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన దగ్గర్నుంచి రమాకుమారి వర్గీయులు వైఎస్సార్‌సీపీ సభ్యులకు ప్రలోభాల ఎర వేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నలుగురైదుగురు వార్డు సభ్యులకు ప్రలోభాల ఆశ చూపి రమాకుమారికి మద్దతునిచ్చేలా ఆమె తరపువారు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ముగ్గురు వార్డు సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
యలమంచిలి పట్టణ కౌన్సిలర్లకు
అధికారికంగా సమాచారం ఇచ్చిన కలెక్టర్


