
మాట్లాడుతున్న శివదత్ వర్గం నాయకులు
నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గ జనసేనలో వర్గపోరు మొదలయింది. పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించడంతోపాటు అభ్యర్థిగా బోడపాటి శివదత్‌ను ప్రకటించాలని ఆ వర్గం నాయకులు మంగళవారం నక్కపల్లి పార్టీ కార్యాలయం వద్ద పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, సహాయ కార్యదర్శి కురందాసు అప్పలరాజు మాట్లాడుతూ.. గత ఆరేడు సంవత్సరాల నుంచి శివదత్ నియోజకవర్గంలో చురుకై న పాత్ర పోషిస్తూ పార్టీ తరపున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారని అన్నారు.
ఆయనకు కాకుండా, ఇప్పటికిప్పుడు పార్టీలో చేరి టికెట్ తమకే ఇవ్వాలని కోరే లక్ష్మీ శివకుమారికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. మరోపక్క నియోజకవర్గ ఇన్‌చార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి జనసేనలో చేరి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గెడ్డం బుజ్జి తమ పార్టీ అభ్యర్థిగా లక్ష్మీ శివకుమారిని తెరమీదకు తీసుకురావడంతోపాటు, ఆమెను నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోను కార్యకర్తలకు పరిచయం చేస్తున్నారు. జనసేన పార్టీలో రెండు వర్గాలు తయారైన నేపథ్యంలో దీనిని అవకాశంగా తీసుకుని టీడీపీ ఆ పార్టీలో కుంపటి రాజేసింది.
బోడపాటి శివదత్ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకున్నారు. ఇస్తే టికెట్ తమకు ఇవ్వాలని, కాని పక్షంలో టీడీపీకి ఇవ్వాలని శివదత్ వర్గం మాట్లాడుతున్నారు. జనసేనలోని రెండు వర్గాలు వేర్వేరు అభ్యర్థులను ప్రతిపాదిస్తే.. ఈ కుమ్ములాటల వల్ల టీడీపీకే టికెట్ కేటాయిస్తారన్న ఎత్తుగడలో భాగంగానే జనసేనలో రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి వర్గపోరుకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఉచ్చులో చిక్కుకుంటే ఈ దఫా కూడా మళ్లీ జెండా కూలీలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.