కొప్పిశెట్టి వెంకటేష్
కొప్పిశెట్టి హేమలత
వీసం దేవి
వీసం నారాయణరావు
నక్కపల్లి : నక్కపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో మండల స్థాయిలో నాయకత్వం వహిస్తున్న రెండు ప్రధాన రాజకీయ కుటుంబాల మధ్య తీవ్రపోటీ జరుగుతోంది. నక్కపల్లి ఎంపీపీ పదవికి వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మరదలు, నక్కపల్లి తాజా ఎంపీటీసీ సభ్యురాలు, తాజా మాజీ వైస్ ఎంపీపీ వీసం నానాజీ భార్య వీసం దేవి పోటీపడుతున్నారు. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్ సతీమణి కొప్పిశెట్టి హేమలత రేసులో ఉన్నారు. వీరిద్దరూ మండల కేంద్రం నక్కపల్లికి చెందిన వారు. రిజర్వేషన్ల వల్ల వీరికి స్వగ్రామాల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున వీసం దేవి రేబాక సెగ్మెంట్ నుంచి, టీడీపీ తరఫున కొప్పిశెట్టి హేమలత దేవవరం సెగ్మెంట్ నుంచి పోటీచేస్తున్నారు. వీరితో పాటు వీరి భర్తలు కూడా ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి వీసం నానాజీ పెద బోదిగల్లం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి, అలాగే టీడీపీ తరఫున కొప్పిశెట్టి వెంకటేష్ కూడా ఇదే పెద బోదిగల్లం సెగ్మెంట్‌నుంచి బరిలో ఉన్నారు. ఇద్దరు హేమా హేమీ నాయకులు ఒకే సెగ్మెంట్ నుంచి పోటీ చేయడంతో బోదిగల్లంలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. ఎంపీపీ పదవి మహిళలకు కేటాయించడంతో వీరిద్దరూ సూపర్ ఎంపీపీలుగా చెలామణి అయ్యేందుకే వారి భార్యలతోపాటు వీరు కూడా పాలకమండలిలో స్థానం కోసం పోటీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు నక్కపల్లి మండలంలో వీసం, కొప్పిశెట్టి కుటుంబాలే ఇరు పార్టీల్లోను కీలక భూమిక పోషిస్తూ వస్తున్నాయి.
వైరి వర్గాలైన ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు ఎంపీపీ పదవిని కై వసం చేసుకునేందుకు తమ శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో మండల పరిషత్ పాలకవర్గాన్ని వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. ఎస్సీ మహిళకు కేటాయించడంతో నక్కపల్లి 2 సెగ్మెంట్ నుంచి వీసం రామకృష్ణ కుటుంబం బలపరచిన ఏనుగుపల్లి రత్నం ఎంపీపీ పదవిని చేపట్టారు. ఈ దఫా జనరల్ మహిళకు కేటాయించారు. మండల పరిషత్ ఏర్పాటైన తర్వాత జనరల్ మహిళకు కేటాయించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పదవిని ఎలాగైనా కై వసం చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీలు పావులు కదుపుతున్నాయి. టీడీపీ తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె.వెంకటేష్‌లు ప్రచారం చేస్తుండగా వైఎస్సార్‌సీపీ తరఫున రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, సీనియర్ నాయకులు మణిరాజు, పాపారావు, జి. నర్సింహమూర్తి, సూరాకాసుల గోవిందు తదితరులు ప్రచారం చేస్తున్నారు.


