యలమంచిలి రూరల్ : రాష్ట్రంలో పలుచోట్ల బాణసంచా పేలుడుతో ప్రమాదాలు జరుగుతున్నా అధికార పార్టీ నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మండలంలో పేరంటాళ్లపాలెం(మెట్టపాలెం) మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం రాత్రి స్థానిక జనసేన నాయకులు కొందరు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో కూడిన బాణాసంచాను అక్రమంగా నిల్వ చేశారు. ఒకే టీచర్‌తో నడుస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ ఒకటే తరగతి గది ఉంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు పాఠశాల తలుపులు తీసి బయట నుంచి తెచ్చిన పేలుడు పదార్థాలను నిల్వ చేశారు. ఈ విషయం తెలిసిన కొందరు గ్రామస్థులు పాఠశాలలో బాణాసంచాను అక్రమంగా నిల్వ చేయడమేమిటని అభ్యంతరం తెలపడంతో బుధవారం ఉదయం జనసేన నేతలు బాణాసంచాను అక్కడి నుంచి మరోచోటుకి తరలించారు. ఒకవేళ పాఠశాలకు విద్యార్థులు వచ్చి అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎవరి బాధ్యత వహిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అసలు రాత్రి సమయంలో పాఠశాల తాళాలు ఎలా తీస్తారని, విలువైన సామగ్రి, రికార్డులు అదృశ్యమైతే బాధ్యత ఎఅవరు వహిస్తారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినవారిపై, వారికి సహకరించిన వారిపై చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో సూర్యప్రకాష్‌ను సంప్రదించగా పేరంటాళ్లపాలెం పాఠశాలలో నిల్వ చేసిన బాణాసంచాను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని ఉపాధ్యాయురాలిని ఆదేశించామన్నారు.


