చింతపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు
టెన్త్ పరీక్షకు 99.27 శాతం హాజరు
సాక్షి,పాడేరు: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రం పాడేరులో తలారిసింగి, ఏపీఆర్ నంబర్–1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీకృష్ణాపురం, సెయింట్ ఆన్స్ కాన్వెంట్‌లో ఆరు కేంద్రాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7,268 మందికి గాను మొదటి రోజు 53మంది గైర్హాజరయ్యారు. 99.27 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులను గేటు వద్ద పూర్తిస్థాయిలో తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా నిఘా పెట్టారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. విద్యార్థులకు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల ఆవరణలో దీవెనలు అందించారు. తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.


