తారుమారు...జన హోరు
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
నిలకడగా కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నాయి. చలి, మంచు తీవ్రత యథావిథిగా కొనసాగుతోంది. ఆదివారం ముంచంగిపుట్టులో 10.4 డిగ్రీలు, అరకులోయలో 10.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 11.2 డిగ్రీలు, హుకుంపేటలో 11.4 డిగ్రీలు, చింతపల్లిలో 12.0 డిగ్రీలు, అనంతగిరిలో 16.3 డిగ్రీలు, కొయ్యూరులో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు. సాయంత్రమయ్యేసరికి శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో వృద్ధులు,చిరువ్యాపారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటే వరకూ మంచు కురుస్తుండడంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించాల్సివస్తోంది.
జి.మాడుగుల: ఆత్మీయుల పలకరింపులు...నేస్తుల ముచ్చట్లు.. భారీ ఎత్తున జరిగిన వ్యాపారలావాదేవీల మధ్య మండల కేంద్రం జి.మాడుగులలో మంగళవారం జరిగిన తారుమారు సంత గిరిజనుల సంప్రదాయాలకు...సరదాలకు వేదికగా మారింది. సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహించే ఈ సంత సందడిగా సాగింది. ఇక్కడ అనుబంధాలు బలపడ్డాయి...కొత్త సంబంధాలు చిగురించాయి. ఇసుకవేస్తే రాలనంతగా జనం పోటెత్తారు.. గత వారం కంటే భారీగా తరలివచ్చారు. సంక్రాంతి పండగకు అవసరమైన కొత్త కుండలు, దుస్తులు, వంటపాత్రలు, కోళ్లు, మేకల కొనుగోలుతో స్థానిక మత్స్యరాస వెంకటరాజు ఘాట్ వద్ద జరిగిన ఈ సంత ప్రాంగణం కిటకిటలాడింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువగా వ్యాపారం జరిగినట్టు అంచనా. సంక్రాంతి పండగ సందర్భంగా గిరిజనులు నూతన వస్త్రాలతో పాటు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. బెల్లం, కుండలు, చిరుధాన్యాలను ఆనవాయితీ ప్రకారం కొనుగోలు చేశారు. పాత సంప్రదాయం ప్రకారం జోరా (నమస్కారాలు) చెప్పుకుని పండగ పిలుపులు పిలుచుకున్నారు. గత వారం కంటే ఈ వారం వ్యాపారలావాదేవీలు పెరగడమే కాకుండా, జనాలు పోటెత్తారు. గత వారం అనివార్య కారణాల వల్ల సంతకు రాలేకపోయిన రైతులు, ఆదివాసీ గిరిజనులు రెండోవారం వస్తారని కమిటీ తెలిపింది. మండలానికి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రాజకీయ పార్టీల నాయకులు తారుమారు సంతలో సందడి చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చిన వ్యాపారులు భారీ ఎత్తున దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో సంక్రాంతి తరువాత వారం రోజుల్లో జరుపుకొనే గొట్టిపండగు ముఖ్యమైనవిగా భావిస్తారు. గిరిజన గ్రామాల నుంచి పసుపు,పిప్పలి, రాజ్‌మా చిక్కుళ్లు, కాఫీ, ఇతర వ్యవసాయోత్పత్తులు, అడ్డాకులు, కొండచీపుళ్లు, నరమామిడిచెక్క వంటి అటవీ ఉత్పత్తులు, పశువులను గిరిజన రైతులు సంతకు తీసుకొచ్చి విక్రయించారు.
జి.మాడుగులలో కిక్కిరిసిన రోడ్లు
గత వారంకంటే భారీగా వచ్చిన గిరిజనులు
రూ.2 కోట్లపైనే వ్యాపారం
ఆత్మీయుల పలకరింపులతో సందడిగా తారుమారు సంత
తారుమారు...జన హోరు
తారుమారు...జన హోరు
తారుమారు...జన హోరు


