వించ్ జర్నీ
అబ్బురపరిచే
బలమైన ఇనుప తీగ సాయంతో నడిచే ట్రాలీ... దట్టమైన అడవి మధ్య లోయలో ప్రకృతిలోప్రయాణం... భూమ్యాకాశాల నడుమ అన్నట్టుగా అబ్బురపరిచేలా ఏర్పాటు చేసిన వించ్‌పై ఒక్కసారైనా జర్నీ చేయాలని టూరిస్టులు భావిస్తారు... అధికారులు కొద్దిరోజులైనా అనుమతివ్వరా... తమ కోరిక తీరదా అని పలువురు ఎదురు చూస్తున్నారు.
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో వేల అడుగుల ఎత్తులో కొండల చాటున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం చారిత్రాత్మకం.ఈ విద్యుత్ కేంద్రానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వించ్ ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇస్తుంది.1948 సంవత్సరంలో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భాగంగా అవసరమైన సామగ్రిని,యంత్రాలను తరలించేందుకు 2,750 అడుగుల ఎత్తులో రూ.60 లక్షల వ్యయంతో వించ్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. 1955 ఆగస్టు19న విద్యుత్ కేంద్రాన్ని అప్పటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు.అప్పటి నుంచి ప్రాజెక్టులో పని చేసే ఉద్యోగులు,సిబ్బంది వించ్ ద్వారా చేరుకుంటున్నారు.రెండుకొండల నడుమ లోయలో ఉండే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి దిగేందుకు 18 నిమిషాలు,పైకి వచ్చేందుకు 13 నిమిషాలు సమయం పడుతుంది.
దేశంలో రెండే రెండు ..
మన దేశంలో రెండే రెండు చోట్ల వించ్‌వేలు ఉన్నాయి. మొదటిది ఆంధ్ర–ఒడిశా సరిహద్దు మాచ్‌ఖండ్ దగ్గర ఒకటి ఉంటే, రెండోది తమిళనాడు రాష్ట్రంలోని పళని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ఉంది.భారీ సామర్థ్యం ఉన్న మోటార్ సాయంతో స్టీల్ రోప్ ద్వారా వించ్‌ని లోయలోకి దించడం,ఎక్కించడం జరుగుతుంది.స్టీల్ రోప్‌ను ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తుంటారు.దీనికి సంబంధించిన డ్రైవర్ కంట్రోల్ రూంలో ఉండి వించ్‌ను నడుపుతుంటారు.ట్రాలీగార్డు మలుపుల దగ్గర వించ్ పట్టాలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.వించ్ ఏర్పాటు చేసి ఇప్పటికి 76సంవత్సరాలు అవుతోంది.ఇన్ని సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే వించ్ అదుపుతప్పిన సంఘటన చోటుచేసుకుంది.ఆ సంఘటనలో సిబ్బంది గాయాలతోనే బయటపడ్డారు.వించ్ ఏర్పాటు చేసినప్పుడే రోప్‌వే ఎక్కడుందో తెలుసుకునేలా జీపీఎస్‌ను ఏర్పాటు చేయడం విశేషం.వించ్ కదలిక బట్టి జీపీఎస్ సూచిక కదులుతూ ఉంటుంది.వించ్ ఎక్కడుందో సూచించే ముల్లు మలుపుల దగ్గరకి చేరుకోగానే కంట్రోల్‌రూమ్‌లోని డ్రైవర్ వేగాన్ని నియంత్రిస్తూ ఉంటాడు.గతంలో పర్యాటకులు,సిబ్బంది వించ్‌లో ప్రయాణించేవారు.అప్పుడు అధికారులు పర్యాటకుల వించ్ ప్రయాణానికి అనుమతి ఇచ్చేవారు.గత కొన్ని సంవత్సరాలుగా వించ్ ప్రయాణానికి ప్రాజెక్టు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు వించ్‌ను చూసి ఆనందపడుతున్నారు తప్ప ప్రయాణించేందుకు అవకాశం లేకపోవడం తీవ్ర నిరాశ చెందుతున్నారు. వించ్ ప్రయాణానికి అధికారులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.వించ్ ప్రయాణ విషయాన్ని ప్రాజెక్టు ఎస్‌ఈ ఎ.వి.సుబ్రమణేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ప్రాజెక్టు భద్రత దృష్ట్యా,ఉన్నతాధికారుల ఆదేశాలతో అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు.
2,750 అడుగుల ఎత్తులో
వించ్ హౌస్ ఏర్పాటు
మాచ్‌ఖండ్ ఉద్యోగులకు మాత్రమే
అవకాశం
ప్రయాణానికి అనుమతి
ఇవ్వాలంటున్న పర్యాటకులు
వించ్ జర్నీ
వించ్ జర్నీ


