సంక్రాంతికి 200 ఆర్టీసీ సర్వీసులు
● ప్రయాణికుల రద్దీకి
అనుగుణంగా ఏర్పాట్లు
● విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు
మద్దిలపాలెం(విశాఖ): సంకాంత్రి సందర్భంగా ప్రయాణిలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామని ఆర్టీసీ విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. పండగ స్పెషల్ బస్సులను విశాఖ ద్వారకా బస్ స్టేషన్‌లో ఆయన మంగళవారం పరిశీలించారు. దూరప్రాంతాల నుంచి విశాఖపట్నంకు ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా విశాఖ రీజియన్ నుంచి మొత్తం 200 సర్వీసులు నడిపామని తెలియజేశారు. ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నం రైళ్లలో వచ్చిన ఉత్తరాంధ్ర ప్రయాణికులు శ్రీకాకుళం, పలాస, టెక్కలి, పార్వతిపురం, రాజాం, పాలకొండ, సాలూరు తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు మంగళవారం 170 సర్వీసులు నడిపినట్లు చెప్పారు. అలాగే విజయవాడ, హైదరాబాదుకు 30 బస్సులు నడిపినట్లు తెలియజేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ద్వారకా బస్ స్టేషన్‌లో అధికారులు, సూపర్‌వైజర్లు, కంట్రోలర్, స్టేషన్ మేనేజర్లు వివిధ డిపోల నుంచి పర్యవేక్షిస్తున్నారన్నారు. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు పద్మావతి, గంగాధర్, మాధురి, డిపో మేనేజర్లు సమన్వయంతో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు.


