ఏఎంఆర్ సంస్థ అనధికార వసూళ్లు
అధికారుల అండతో సీనరేజ్ పేరుతో మైనింగ్ వాహనాలపై ఏఎంఆర్ సంస్థ చేస్తున్న అక్రమ వసూళ్లపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం బవులువాడకు చెందిన కె.సత్తిబాబు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. క్వారీలు, క్రషర్ల నిర్వహణతో మైనింగ్ శాఖ ద్వారా వచ్చే ప్రభుత్వాదాయానికి గండి కొట్టి సదరు సంస్థ ప్రతి మైనింగ్ వాహనాన్ని అడ్డుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. వాహనాలకు బోగస్ బిల్లులు ఇచ్చి భారీ మోసం చేస్తున్నా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద అనధికార చెక్‌పోస్టుల్లో ప్రైవేటు వ్యక్తులను పెట్టి వాహనాలను వెంబడించి మరీ వసూళ్లు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతుల కళ్లాల్లో కప్పుకునే మట్టి తరలింపులపైనా దాడులు చేస్తూ అశాంతి వాతావరణం సృష్టిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా అక్రమ వసూళ్లపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


