పాసు పుస్తకాల్లో తప్పులు తడకలపై రగడ
దేవరాపల్లి: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూమి పట్టాదారు పాసు పుస్తకాలు తప్పులు తడకగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులను బోయిలకింతాడ సర్పంచ్ సర్పంచ్ బూరె బాబూరావు, తదితర సభ్యులు నిలదీశారు. ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి అధ్యక్షతన సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. జెడ్పీటీసీ కర్రి సత్యం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తన పాసు పుస్తకంలో సైతం ఫొటో, ఫోన్ నంబర్ తప్పు పడిందని, ఇప్పటికే రెండు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బోయిలకింతాడ సర్పంచ్ బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు సరిచేయకుండా పాసు పుస్తకాలు పంపిణీ చేయడంతో ప్రజాధనం వృథా తప్పా, ప్రయోజనం ఏమిటని డిప్యూటీ తహసీల్దార్ కె. అప్పారావును ప్రశ్నించారు. ఈ సమయంలో పీఏసీఎస్ అధ్యక్షులు జోక్యం చేసుకోవడంతో బాబూరావు సహా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించకుండా సభ్యులు తమ సమస్యలను సభలో లేవనెత్తుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని, ఇది ముమ్మాటికి సభ్యుల హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరగడంతో ఒక్కసారిగా సభ రసాభాసగా మారింది. ఎంపీపీ బుల్లిలక్ష్మి జోక్యం చేసుకొని సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరొకరు మాట్లాడటం సరికాదని, కచ్చితంగా సభా మర్యాదలు పాటించాలని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. రైవాడ జలాశయంలో చేప పిల్లల విడుదలపై తనకు మత్స్యశాఖ అధికారులు కనీస సమాచారం ఇవ్వడం లేదని సర్పంచ్ చల్లా లక్ష్మి సభ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో చేప పిల్లల విషయంలో తప్పుడు లెక్కలతో ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారన్నారు. కొత్తపెంటలో మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను బాగు చేయాలని సర్పంచ్ రొంగలి వెంకటరావు ఎలక్ట్రికల్ ఏఈఈ కె. శంకరరావును కోరారు. పశు బీమా సొమ్ము గత కొన్నేళ్లుగా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు ప్రశ్నించారు. వైస్ ఎంపీపీలు ఉర్రూకుల గంగాభవానీ, పంచాడ సింహాచలంనాయుడు, ఎంపీడీవో ఎం.వి. సువర్ణరాజు, ఏవో డి.వి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఎంపీడీవోలు కిరణ్ వరప్రసాద్, పి.వి. అలవేణిమ్మ, సర్పంచ్‌లు చింతల సత్య వెంకటరమణ పాల్గొన్నారు.


