అర్జీలకు సత్వర పరిష్కారం
అర్జీలు స్వీకరిస్తున్న ఆర్డీవో రమణ
నర్సీపట్నం: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయాశాఖల అధికారులను ఆర్డీవో వి.వి.రమణ ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో తొమ్మిది అర్జీలు స్వీకరించినట్టు ఆయన తెలిపారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నర్సీపట్నం మండలం గురంధరపాలెంకు చెందిన ఎ.రాజు అర్జీ పెట్టుకున్నారు. మా భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, సరి చేయాలని కోరుతూ రావికమతం మండలం, కొత్తకోటకు చెందిన వి.రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నా రు. నివాస స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకునేందుకు ఎల్‌పీసీ ఇవ్వాలని కోరుతూ కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామానికి చెందిన జె.కొండయ్య దరఖాస్తు చేశారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారానికి వీలుకాకపోతే కారణాన్ని అర్జీదారునికి తెలియజేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆర్డీవో సూచించారు.


