ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
దేవరాపల్లి: స్థానిక రెవెన్యూ పరిధిలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, పరిరక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ఆయన కళ్లకు గంతలు కట్టుకొని, ఆక్రమణ భూముల వివరాలతో కూడిన ఫ్లెక్సీ చేతపట్టి వినూత్న నిరసనకు దిగారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 281/2లో భూమికి 281/2ఏ అని రెవెన్యూ రికార్డుల్లో లేని భూములకు గతంలో అధికారులు పాసు పుస్తకాలు మంజూరు చేశారన్నారు. దీని ఆధారంగా ఆక్రమణదారుడు మరో రెండు సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి దర్జాగా సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దర్యాప్తు చేసి పంటలు సహా ఈ భూములన్నింటిని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఉంచారన్నారు. ఆక్రమణదారుడు 2017లో చోడవరం కోర్టును ఆశ్రయించగా కోర్టు కొట్టేసిందన్నారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో ఫలసాయం తీసుకునేందుకు తాత్కాలికంగా ఇంటెర్మ్ ఆర్డర్ జారీ చేసిందన్నారు. ప్రస్తుతం భూముల్లో గెస్ట్ హౌస్ నిర్మించి, ఫల సహాయం అనుభవించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వ భూముల్లో పంటలకు రక్షణ కల్పించి, గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై సర్వ సభ్య సమావేశంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు.


