గ్రామాల్లో కానరాని హరిదాసుల సందడి
మాడుగుల: ఒకప్పుడు ఽహరిదాసులు గ్రామాలకు దిగారంటే ధనుర్మాసం వచ్చినట్లుగా భావించేవారు. నెత్తిన అక్షయ పాత్ర పెట్టుకుని హరినామ కీర్తనలు వినసొంపుగా పాడుకుంటూ గ్రామ వీధుల్లో తెల్లవారక ముందే తిరిగేవారు. వారి వెంట చిన్నారులు, పెద్దవారు తిరిగి భక్తిభావంతో సందడిగా ఉండేది. ఈ కాలంలో రైతులకు పంటలు చేతికి రావడంతో ధాన్యం, బియ్యం, కాసులు అక్షయ పాత్రలో వేసి వారి భక్తిభావం చాటుకునేవారు. ఈ విధంగా వందలాది కుటుంబాలు జీవనం సాగించేవి. అయితే హరి నామ కీర్తనలు వినేవారు లేక, మైక్‌సెట్‌లు, టీవీలు అందుబాటులోకి రావడంతోపాటు నాగరికత పెరిగిపోవడంతో వీరికి ఆదరణ తగ్గిపోయింది. దీంతో వీరు కులవృత్తులను వదిలి కంపెనీలతోపాటు ఇతర వృత్తుల్లోకి మారిపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఇదే వృత్తిని కొనసాగించే వారిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకప్పుడు 500 మంది ఉండేవారు. ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సగానికిపైగా వృద్ధాప్యంలోకి చేరుకున్నారు. వీరు తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి అనకాపల్లి, తదితర గ్రామాలకు వలసొచ్చి కార్తీక మాసం నుంచి నాలుగు నెలల పాటు ఇక్కడే ఉండి ఏప్రిల్‌లో శ్రీరామ నవమికి భద్రాచలం వెళ్లేవారు. అక్కడ వీరు సేకరించిన దినుసులు కొంత శ్రీరాములవారికి సమర్పించుకుని దీక్ష ముగించుకుని స్వగ్రామాలకు చేరుకుని వ్యవసాయం, తదితర వృత్తుల్లో చేరిపోతుంటారు.
వీరు హరినామ కీర్తనలు పాడుకుని అక్షయ పాత్ర నెత్తిన ఉన్నంత సేపు నియమ నిబంధనలతో ఉపవాసం ఉంటారు. ఒక్కొక్క రోజు సాయంకాలం వరకు ఉపవాసంతోనే తిరుగుతారు. ఈ వృత్తిలో బతకలేక వేరే వృత్తి చేతకాక ఇంకా ఈ వృత్తినే కొనసాగుతున్న వారికి ప్రభుత్వం పింఛన్లు ఏర్పాటు చేసి హరిదాసులు కుటుంబాలను ఆదుకోవాలని వీరంతా కోరుకుంటున్నారు.


