మూలకొత్తూరు చెరువు హక్కులపై నిరసన
పంచాయతీల విభజనలో భాగంగా రాంబిల్లి మండలం గోకివాడ పంచాయతీలో ఉన్న మూలకొత్తూరు గ్రామానికి చెందిన సర్వే నంబరు 320లో చెరువును కూడా కేటాయించి న్యాయం చేయాలంటూ సంబంధిత గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. మూలకొత్తూరులో చెరువును గోకివాడ గ్రామానికి కేటాయించేలా చేపడుతున్న విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు నీటితోపాటు సాగుకు ఏకై క ఆధారంగా ఉన్న చెరువు కోసం కోర్టు కేసులు వేసి మరీ సాధించుకున్నామన్నారు.
ఇప్పటికే గోకివాడ పెద్దలు చేపల పెంపకం ద్వారా చెరువును ఆధీనంలో ఉంచుకున్నారని, వాటి ఆదాయం పొందడమే కాకుండా పంటలకు సాగునీరవ్వలేదన్నారు. చివర్లో చేపల వేట తర్వాత మిగిలిన కలుషిత నీటిని మాత్రం మా గ్రామానికి వదిలి పంటలను నాశనం చేస్తున్నారని, పశువుల మృతి చెందుతున్నాయని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి గ్రామసభ ద్వారా తుది నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరారు.


