పగిలిన గుండెలు... | - | Sakshi
Sakshi News home page

పగిలిన గుండెలు...

Apr 14 2025 1:46 AM | Updated on Apr 14 2025 2:00 AM

బాణసంచా కేంద్రంలో బతుకులు బుగ్గి ● కై లాసపట్నంలో ఘోర విషాదం

సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల :

పొట్టకూటి కోసం మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు వెళ్లిన పలువురు కార్మికులు ఆ మందుగుండుకే ఆహుతయ్యారు. బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం పేద కార్మిక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన విస్ఫోటనం ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలను మింగేసింది. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో గ్రామస్తులంతా ఇళ్లలో సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించి అగ్ని ప్రకంపనలు సృష్టించినట్టుగా చుట్టూ పొగ, మంటలు కనిపించాయి. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో గల బాణసంచా కేంద్రంలో సంభవించిన పేలుడు ధాటికి గ్రామస్తులు భీతావహులయ్యారు. మంటలు ఎగిసిపడుతుంటే ఆవైపు వెళ్లాలంటే భయం..మరో వైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైర్‌ ఇంజన్‌, 108కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాదం జరిగిందిలా...

కై లాసపట్నం గ్రామానికి చెందిన మడగల జానకీరాం తన తోడల్లుడు అప్పికొండ తాతబ్బాయి పేరున ‘విజయలక్ష్మి ఫైర్‌వర్క్స్‌’ మందుగుండు తయారీకి లైసెన్సు తీసుకుని 20 ఏళ్లుగా మందుగుండు తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్‌కు వచ్చే ఏడాది 2026 వరకూ గడువు ఉంది. దీపావళి పండగతో పాటు సమీప మండలాల్లో పల్లెల్లో జరిగే గ్రామ పండుగలకు వచ్చే ఆర్డర్లపై మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. కొత్త అమావాస్య నుంచి వరుసగా పల్లెల్లో పండగలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. వర్క్‌లోడ్‌ ఎక్కువగా ఉండడంతో కార్మికులు ఒత్తిడితో పనిచేస్తున్నారు. సరిగ్గా 12.30 గంటల సమయంలో ఓ కార్మికుడు మందును దంచుతుండగా ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. వారం రోజులుగా తయారు చేసిన మందుగుండు సామగ్రి మొత్తం అక్కడే ఉండడంతో ఒక్కొక్కటిగా క్షణాల్లో అంటుకుపోయాయి. పక్కనే ఉన్న పౌడర్‌పై అగ్గి రేణువులు తూలి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పనిచేస్తున్న కార్మికులు తేరుకుని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్రంగా కాలిపోయి 8 మంది కార్మికులు అక్కడికక్కడే మాడి మసైపోయారు. విస్ఫోటనం ధాటికి అక్కడ ఉన్న రేకుల షెడ్లు, రెండు చిన్న స్లాబ్‌ గదులు చెల్లా చెదురయ్యాయి. భూమి కంపించినట్టయి..పెద్దగా మంట రావడంతో గ్రామస్థులంతా అదిరిపడి ఒక్కసారిగా పరుగున వచ్చారు. వరహాలు అనే గ్రామస్తుడు ఫైర్‌ ఇంజిన్‌, 108కి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సీపట్నం, నక్కపల్లి, కోటవురట్ల, ప్రభుత్వ ఆస్పత్రి 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.సమీప నక్కపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నుంచి మూడు ఫైర్‌ ఇంజిన్‌లు వచ్చాయి. మంటలు అదుపు చేయడానికి సుమారు 4 గంటల పాటు సమయం పట్టింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని విశాఖ కేజిహెచ్‌కు తరలించారు. మైనర్‌ గాయాలతో ఉన్న వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

ఘటనా స్థలానికి కలెక్టర్‌..

ప్రమాదం జరిగిన గంటన్నర వ్యవధిలోనే జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక కోటవురట్ల సీహెచ్‌సీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కోటవురట్ల ప్రభుత్వ ఆస్పత్రి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్‌, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కలెక్టర్‌ సంఘటన స్థలానికి చేరుకుని పేలుడుకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పగిలిన గుండెలు...1
1/2

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...2
2/2

పగిలిన గుండెలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement