ఊపిరి తీసిన విద్యుత్ తీగలు
విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడి
కూలీ మృతి
మునగపాక: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విద్యుత్ పనులు నిర్వహించే కూలీ మృత్యువాతకు గురైన సంఘటన మునగపాకలో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం దండిసురవరం గ్రామానికి చెందిన బూసాల శంకరరావు(33)కు అయిదు సంవత్సరాల క్రితం వివాహమైంది. అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మునగపాకలో ఈ నెల 12వ తేదీన సంభవించిన గాలివాన కారణంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా స్తంభంపై పనులు చేపడుతున్నాడు. ఇదే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తాకడంతో శంకరరావు కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి 108 వాహనంలో తరలించేలోపు మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న మునగపాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుడు శంకరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


