నేత్రపర్వం.. వసంతోత్సవం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం వైభవంగా జరిగాయి. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను కల్యాణ మండపంలో అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. పసుపు కొమ్ములను దంచి కొట్నాలు సేవ చేశారు. వసంతాలను ఉత్సవమూర్తుల వద్ద ఉంచి పూజలు జరిపారు. ఆ వసంతాలతో అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఆలయ బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలోని స్వామివారి మూల విరాట్‌కు, ఆలయంలో కొలువుదీరిన దేవతా మూర్తులకు వసంతాలను సమర్పించారు. అక్కడి నుంచి వసంతాలను మళ్లీ కల్యాణ మండపానికి ప్రదక్షిణగా తీసుకొచ్చి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం ఆ వసంతాలను అర్చకులు భక్తులపై చల్లారు. తదుపరి అర్చకులు, సిబ్బంది, భక్తులు వసంతాలను ఒకరిపై ఒకరు జల్లుకుని సందడి చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ఒక పల్లకీలో, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను మరొక పల్లకీలో గంగధార వద్దకు తిరువీధిగా తీసుకెళ్లారు. అక్కడ గంగధార, పంచామృతాలతో పంచ కలశ స్నపనాన్ని విశేషంగా జరిపారు. చక్రస్నాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చక్రపెరుమాళ్లను గంగధార నీటి ప్రవాహం వద్ద ఉంచి ఆ నీటిని భక్తులపై పడేలా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. తదుపరి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి ఆలయంలోకి తిరువీధిగా తీసుకెళ్లారు. అంతకుముందు ఆలయ యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు సతీసమేతంగా ఉత్సవంలో పాల్గొన్నారు. ఏఈవో ఆనంద్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రంగులమయమైన సింహగిరి
పరవశించిన భక్తజనం
నేత్రపర్వం.. వసంతోత్సవం
నేత్రపర్వం.. వసంతోత్సవం
నేత్రపర్వం.. వసంతోత్సవం
నేత్రపర్వం.. వసంతోత్సవం


