బంగారు వస్తువుల అపహరణ కేసులో నిందితురాలు అరెస్టు
రంపచోడవరం: అపహరణకు గురైన బంగారు వస్తువులను గంగవరం పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నట్టు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంగవరం పీఎస్ పరిధిలో మార్చి నెలలో రోళ్లుపల్లి సూర్యకాంతం ఇంటి బయట మరిచిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌లో బంగారు వస్తువులు పోయినట్టు ఫిర్యాదు అందినట్టు తెలిపారు. సదరు మహిళ తన సొంత గ్రామం పి.ఎర్రగొండ వెళ్లేందుకు గంగవరంలోని తన ఇంటి వద్ద బయలుదేరినట్టు పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగ్‌లో నల్లపూసలు–24 గ్రామలు, బంగారు చైను–16 గ్రాములు, మూడు ఉంగరాలు–11 గ్రాములు ఉన్నట్లు ఫిర్యాదులో పెర్కొన్నట్టు తెలిపారు. సెల్‌ఫోన్ తెచ్చుకునేందుకు ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి బ్యాగ్ జిప్ తీసి, మళ్లీ వేసినట్టు అనుమానం వచ్చి బ్యాగ్‌ను చూసేసరికి బంగారు వస్తువులు అందులో లేవన్నారు. దీనిపై ఎస్‌ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. రెండు టీములుగా ఏర్పడి, సీసీ టీవీ పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రోళ్లుపల్లి లక్ష్మి సౌజన్యను ముద్దాయిగా గుర్తించినట్టు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో ఆమెను గంగవరం సెంటర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ముద్దాయి నుంచి అపహరణకు గురై బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు విలువ రూ.2.04లక్షలు ఉంటుందన్నారు. బంగారు చోరీ కేసును త్వరితగతిన చేధించినందకు సీఐ బి.నరసింహమూర్తి, ఎస్‌ఐ వెంకటేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిప్రశాంత్


