గిరిజన చట్టాలకు కూటమి ప్రభుత్వం తూట్లు
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం టూరిజం అభివృద్ధి ముసుగులో 1/70 చట్టానికి నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని, ఇందుకు గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీలో రంపచోడవరం ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చెప్పకనే తెలుస్తుందని ఆదివాసీ సంఘాల కూటమి నాయకులు ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి , ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబూరావు అన్నారు. వారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ 1/70 చట్టం ప్రకారం ప్రభుత్వం నేరుగా ఏజెన్సీలో పరిపాలించడానికి గాని, అధికారం చెలాయించటానికి గాని హక్కులేదని, ఇక్కడి వనరులపై పూర్తి హక్కులు ఆదివాసీలకే ఉన్నాయన్నారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం ఆదివాసీ ప్రజాప్రతినిధులతో గిరిజన చట్టాలు, హక్కులను తొలగించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీన్ని ఆదివాసీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.రామన్నదొర పాల్గొన్నారు.
అరకులోయ టౌన్: టూరిజం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో గల సహజవనరులను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర చెప్పారు. మండల కేంద్రంలోని గిరిజన సంఘం నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులైన మైనింగ్ వనరులు, అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, అటవి భూములు టూరిజం అభివృద్ధి పేరుతో ప్రైవేట సంస్థలకు దారాదత్తం చేయడానికి కూటమి ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అరకులోయ పర్యటనలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చేసిన ప్రకటన వెనుక 1/70 చట్టం నిర్వీర్యం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రను వ్యతిరేకించి, ఆదివాసీ చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు రామన్న, మగ్గన్నా, రాము తదితరులు పాల్గొన్నారు.
గిరిజన చట్టాలకు కూటమి ప్రభుత్వం తూట్లు


