రాజవొమ్మంగి ఎంపీపీకి అరకు ఎంపీ సత్కారం
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి ఎంపీపీ గోము వెంకటలక్ష్మిని అరకు ఎంపీ తనూజారాణి మంగళవారం ఘనంగా సత్కరించారు. పాడేరులో జరిగిన దిశ సమావేశానికి హాజరైన ఎంపీపీ మండలంలోని పలు సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. మండలం మీదుగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌హెచ్ 516ఈ నిర్మాణ పనుల్లో అనేక మంది ఇళ్ల స్థలాలు కోల్పోయి, నష్టపరిహారం అందక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దినేష్‌కుమార్. ఐటీడీఏ పీవో సింహాచలం దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ళ వానకు లాగరాయి, కొత్త కిండ్ర, దమనపాలెం, కిర్రాబు, తాళ్ళపాలెం గ్రామాల్లో జీడిమామిడి తోటలు ధ్వంసమయ్యాయని అధికారులకు తెలియజేశారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రంపచోడవరం డివిజన్, రాజవొమ్మంగి మండలంలోని అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను సభ దృష్టికి ఎంపీపీ తీసుకెళ్లారు. ఈ నేపధ్యంలో ఎంపీపీ వెంకటలక్ష్మిని అధికారులు అభినందించారు.


