హుకుంపేట: మండలంలోని కొట్నాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పాములపుట్టు గ్రామానికి చెందిన గెమ్మెలి నూకరాజు(45), దొసుద(43) కొట్నాపల్లిలో జరిగిన క్రైస్తవ సమావేశానికి మంగళవారం సాయంత్రం వచ్చారు. సమావేశం అనంతరం తమ స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై మూడు సంవత్సరాల కుమారుడితో కలిసి బయలుదేరారు. కొట్నాపల్లిలో ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొంది. బాలుడికి తీవ్ర గాయాలు కాగా, భార్యాభర్తలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు హుకుంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుడిని పాడేరు ఆస్పత్రికి పంపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
ఆదుకోవాలని ఆందోళన
కొట్నాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నూకరాజు,దొసుద కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుకుంపేట పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సీసీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు తాపుల కృష్ణారావు,సొంటెన హైమవతి మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో పలు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం


