కొయ్యూరు/రాజవొమ్మంగి: ఒక వైపు ఎండలు మండుతుంటే జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రెండు గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ చండప్రచండగా సూరీడు నిప్పులు చెరగగా, మరిన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా వాన పడింది. కొయ్యూరు మండలం మంప పంచాయతీ పైడిపనుకులలో సుమారు అరగంట పాటు వడగళ్ల వర్షం కురిసింది. మండలంలో కొన్నిచోట్ల భారీగా, మరికొన్నిచోట్ల ఒక మోస్తారు వర్షం పడింది. ఈదురు గాలులు వీచడంతో చాలా చోట్ల జీడి పిందెలు రాలిపోయాయి. దాదాపుగా ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలిఘట్టం నుంచి కృష్ణదేవిపేట మధ్యలో లైన్ పాడైపోవడంతో ప్రత్యామ్నాయంగా రాజవొమ్మంగి నుంచి విద్యుత్ సరఫరా చేశారు. రాజవొమ్మంగి మండలం కొత్త కిండ్రలో వడగళ్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల గంటకు పైగా వర్షం పడింది. ఈ వర్షం ప్రస్తుతం మండలవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో సాగవుతున్న రబీ పొగాకు పంటకు మేలు చేస్తుందని రైతులు తెలిపారు.
పాడేరు : పట్టణంలో కురిసిన వర్షంతో ప్రజలు ఉమశమనం పొందారు. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో అరగంట పాటు వర్షం కురవడంతో పట్టణవాసులు సేదతీరారు.
గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ కాసింది. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలచిపోయింది. ఈ వర్షాలు కాఫీ తోటలకు అనుకూలమని ఆర్వీనగర్ కాఫీ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు తెలిపారు.
జి.మాడుగుల(పాడేరు రూరల్): మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం పడింది.కొత్తపల్లి జలపాతం ప్రాంతంతో పాటు జి.మాడుగుల, బంధవీధి, సొలభం, గడుతురు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం
రెండు ప్రాంతాల్లో వడగళ్ల వాన
గాలులకు రాలిన జీడిమామిడి పిందెలు
ఈదురు గాలులు..వడగళ్లు
ఈదురు గాలులు..వడగళ్లు
ఈదురు గాలులు..వడగళ్లు