కొయ్యూరు: ప్రతి ఒక్కరూ గొప్పగా ఎదిగే లక్ష్యాలను పెట్టుకోవాలని, గిరిజన యువత అన్ని రంగాల్లో రాణించాలని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం యూ.చీడిపాలెం పంచాయతీ పలకజీడిలో ఉచిత వైద్య శిబిరం, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ యువత మత్తుకు దూరంగా ఉండాలని కోరారు. గిరిజనులు ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లు దరి చేరనీయరాదని చెప్పారు. పోలీసులు నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో 30 జట్లు పాల్గొనగా కొయ్యూరు మండలం యర్రగొండ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. వీరికి రూ.8 వేల నగదు,ద్వితీయ స్థానంలో నిలిచిన వై.రామవరం మండలం కోట జట్టుకు రూ.5 వేలు,తృతీయస్థానంలో నిలిచిన వై.రామవరం మండలం మునసలపాలెం జట్టుకు రూ.3 వేల నగదు అందజేశారు. పాల్గొన్న అన్ని జట్లకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి,కొయ్యూరు సీఐ వెంకటరమణ, వై.రామవరం ఎస్‌ఐ రామకృష్ణ,మంప ఎస్‌ఐ శంకర్ రావు,సీఆర్‌పీఎఫ్ సహాయ కమాండెంట్ రాధ, పీఎస్‌ఐలు చక్రధర్, సత్యం,సురేష్,యూ.చీడిపాలెం సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు.
రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్