
అంబరాన్నంటిన సంబరం
పెదబయలు: మండల కేంద్రం పెదబయలులో మోదకొండమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచే కాకుండా ఒడిశా నుంచి తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు సతకంపట్టు నుంచి ప్రారంభమైన అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాల ఊరేగింపు సీతగుంట చేరింది. అక్కడి నుంచి అమ్మవారి ప్రధాన ఆలయం వరకు సాగింది. భారీ స్థాయిలో నిర్వహించిన బాణసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. ఊరేగింపులో బేతాల వేషాలు, కోబ్రా డ్యాన్స్, కోలాటం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్‌ఐ కె.రమణ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రూడకోట గురుస్వామి సింహాచలం శిష్య బృందం శ్రీను, సతీష్, కిరణ్, జనసేన నాయకులు ప్రసాదాలు పంపిణీ చేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తనయుడు చాణక్య, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిమంకరి బొంజుబాబు, తలారి చక్రధర్, దడియా రాంబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, కమ్మిడి ఆశోక్, రేగం శివ, మజ్జి చంద్రుబాబు, సందడి కొండబాబు, అజయ్‌కుమార్, పాంగి సింహాచలం, శశిధర్, రమేష్‌కుమార్, రామ్మూర్తి, పరుశురాం జోగి రాము ఉద్యోగ,ఉపాధ్యాయులు, వర్తకులు, మోటార్ యూనియన్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
పెదబయలులో ఘనంగా ముగిసిన మోదకొండమ్మ ఉత్సవాలు
పోటెత్తిన భక్తులు
భక్తిశ్రద్ధలతో పూజలు
ఆకట్టుకున్న బాణసంచా కాల్పులు

అంబరాన్నంటిన సంబరం