
తొమ్మిది నెలలుగా జీతాల్లేవు
పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య వర్కర్లకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. ఈ ఏడాది ప్రారంభంలోనే సమస్యపై ఐటీడీఏలో అర్జీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికై నా సమస్య పరిష్కరించకపోతే ఐటీడీఏను ముట్టడించి ఆందోళన చేస్తాం. జీతాలు విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. 11 మండలాల్లో 700 మంది వర్కర్‌లకు జీతాలు రావాలి.
– పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులు
4 కిలోమీటర్ల రోడ్డుకు.. 9 సార్లు అర్జీ
వై.రామవరం మండలం చింతలపూడి పంచాయతీ కొత్తూరు గ్రామం నుంచి చింతకొయ్యకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలని ఇప్పటి ఎనిమిది సార్లు అర్జీలు అందజేశాం. తాజాగా సోమవారం మరోసారి అర్జీ ఇచ్చాం. రోడ్డు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలి. పదే పదే వచ్చి అర్జీలు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటోంది. అధికారులు మా పరిస్థితి అర్థం చేసుకోవాలి.
– పల్లాల సన్యాసమ్మ, సర్పంచ్ చింతలపూడి.
రంపచోడవరం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. చాలా మంది తమ సమస్యలు పరిష్కరించాలని మళ్లీ మళ్లీ పీజీఆర్‌ఎస్‌కు రావలసి వస్తోంది. తమ సమస్యలు మండల స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ఐటీడీఏ పీవోకు తమ గోడును వినిపిస్తే పరిష్కారం అవుతాయనే గంపడాశతో వస్తున్నా వ్యయప్రయాసలు మిగులుతున్నాయని తప్ప పరిష్కారం లభించడం లేదు. రంపచోడవరం ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నా పరిష్కారానికి నోచుకోకపోవడంతో అదే సమస్యతో అర్జీదారులు మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఫిర్యాదుదారులు ఇచ్చే వినతులు స్వీకరించి వాటిని గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో గిరిజన సదస్సులు పేరుతో అధికార యంత్రాంగం గిరిజనుల ముంగింటకే వెళ్లి అర్జీలు స్వీకరించి అక్కడే పరిష్కారం చూపేది. గ్రామాల్లో అందరికీ ఉపయోగపడే సమస్యలకు పరిష్కారం లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామానికి సంబంధించిన సమస్యలపై సైతం పదే పదే ఐటీడీఏకు వచ్చి అర్జీలు ఇవ్వవలసి వస్తోంది. రోడ్లు, వంతెనలు, తాగునీరు, కులధ్రువీకరణ పత్రాలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, జీతభత్యాలు తదితర సమస్యలపై ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయి. దూర ప్రాంతంలో ఉన్న వారు ఒకసారి ఐటీడీఏకు వచ్చివెళ్లేందుకు చాలా ఖర్చవుతుందని బాధితులు వాపోతున్నారు. ఈ సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికను పరిశీలిస్తే వ్యక్తిగత సమస్యల కంటే గ్రామాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వచ్చాయి. అధికారులు మొత్తం 82 అర్జీలను స్వీకరించారు.
మా సమస్యలు తీర్చండి మహాప్రభో అంటూ అర్జీలు పట్టుకొని వారం వారం ఐటీడీఏకు వస్తున్నాం. కాళ్లు పీకినా..కళ్లు తిరుగుతున్నా.. గంటల తరబడి క్యూలో నిలుచుని అధికారులకు దరఖాస్తులు అందజేస్తున్నాం.. కానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి మా కష్టాలు అంటూ వాపోతున్నారు అర్జీదారులు. తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావించి ఎన్నో కష్టాలు పడి కూలి పనులు వదులుకొని వచ్చి అధికారులకు విన్నవించినా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అవి ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అర్థం కావడం లేదని వాపోతున్నారు. అయినా, ఆశ చావక మళ్లీ మళ్లీ వస్తున్నామని చెబుతున్నారు. వీరి సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో ఆ అధికారులకే తెలియాలి.
వాటర్ ట్యాంకు కోసం పదిసార్లు అర్జీలు
రంపచోడవరం మండలం ఇసుకపట్ల గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం పది సార్లు ఐటీడీఏ గ్రీవెన్స్‌లో అర్జీలు
అందజేశాం. మంజూరైందని చెబుతున్నారు గానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు. అధికారులు స్పందించకపోతే రంపచోడవరం వచ్చి ధర్నా చేస్తాం. గ్రామాల్లో మంచినీటి సదుపాయం కోసం నిధులు వస్తున్నా, మా గ్రామంలో కనీసం మంచినీటి ట్యాంకు నిర్మాణం చేయడం లేదు.
– అన్నిక పండమ్మ,
ఇసుకపట్ల
కాళ్లు అరిగిపోతున్నాయి..
దేవీపట్నం మండలం కంబాలపాలెంలో నిర్మించి న పోలవరం పునరావాస కాలనీలో వర్షా కాలంలో ఇళ్లు శ్లాబులు లీకై కారిపోతున్నాయి.
అనేసార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాం. కాళ్లు అరిగిపోతున్నట్టు తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సమస్య పరిష్కారం కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టాలి. గిరిజనుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. వర్షం వచ్చినప్పుడు కాలనీకి వచ్చి చూస్తే మా దుస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికై నా స్పందిస్తారని అర్జీ అందజేశాం.
– కొమరం పోశమ్మ,
కంబాలపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ
వంతెన నిర్మాణం కోసం ఐదుసార్లు అర్జీలు
అడ్డతీగల మండలం అనిగిరి గ్రామానికి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పటికే ఐదు సార్లు అర్జీలు అందజేశాం. నిర్మాణం పనులు ప్రారంభించి నాలుగేళ్లు అవుతోంది. వంతెన పనులు నిలిచిపోవడంతో గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు.గిరిజన గ్రామాలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇక ఇక్కడకు మరి రాబోం. వంతెన నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తాం.
– భారతి, అనిగిరి,
అడ్డతీగల మండలం.
కులధ్రువీకరణ పత్రాల కోసం కాళ్లరిగేలా..
రాజవొమ్మంగి గ్రామానికి చెందిన మేము వాల్మీకి కులస్తులం.అన్ని హక్కులు ఉన్నా మాకు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు రెవెన్యూ అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. కులధ్రువీకరణ పత్రాలు లేక మా పిల్లలు చదువు పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. ఐటీడీఏ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చినప్పుడు తహసీల్దార్ కార్యాలయానికి ఫోన్ చేస్తామంటున్నారు. తరువాత పట్టించుకునే నాథుడే లేడు. కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ఇళ్లు కూడా మంజూరు చేయడం లేదు. కనీసం ఇళ్లు మంజూరు చేయాలి. చాలా సార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోయింది.
– బొర్రా సింహాచలం, రాజవొమ్మంగి
అర్జీలు స్వీకరిస్తున్న ఐటీడీఏ పీవో సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ

తొమ్మిది నెలలుగా జీతాల్లేవు

తొమ్మిది నెలలుగా జీతాల్లేవు

తొమ్మిది నెలలుగా జీతాల్లేవు

తొమ్మిది నెలలుగా జీతాల్లేవు

తొమ్మిది నెలలుగా జీతాల్లేవు

తొమ్మిది నెలలుగా జీతాల్లేవు