
గిరిజనుల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
సాక్షి,పాడేరు: స్పందనలో స్వీకరించిన వినతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన ఫిర్యాదులపై అన్నిశాఖల అధికారులు శ్రద్ధ చూపాలని, ప్రతి ఫిర్యాదుకు విచారణాధికారిని నియమించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ శివశ్రీనివాస్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్, ట్రైనీ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో అంబేద్కర్, వివిద శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వినతుల వెల్లువ
స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి.జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ వ్యక్తిగత,గ్రామాల సమస్యలపై కలెక్టర్‌కు 96 వినతులను అందజేశారు.
● కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట నుంచి అన్నవరం గ్రామానికి రోడ్డు నిర్మించాలని అన్నవరం గిరిజనులు కోరారు.
● తన కుమార్తె విశాఖపట్నం కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివించేందుకు ఆర్థిక సాయం అందించాలని పాడేరు మండలం గుత్తులపుట్టు గ్రామానికి చెందిన రోజారమణి దరఖాస్తు చేశారు.
● కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ, కొమ్మనూరు, ఉడత గ్రామాలకు చెందిన 35 మంది చిన్నారులు, 12మంది గర్భిణులు ఉన్నందున కొమ్మనూరులో అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని గిరిజనులు కలెక్టర్‌ను కోరారు.
● పాడేరు మండలం వంజంగి కొత్తూరు రోడ్డు అభివృద్ధి చెందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరారు.
● పాడేరు మండలం గుత్తులపుట్టు పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన వంతాల లక్షణబాబు తన అటవీ భూమిలో సాగు చేసిన కాఫీతోటను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా ఆర్థిక సాయం అందజేసి కాఫీ తోట పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
క్షేత్రస్థాయితో తప్పనిసరిగా విచారణ
కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశం