పట్టణంలో దీర్ఘకాలిక సమస్యలపై అవగాహన ఉంది
వాటిని పరిష్కరించి, అభివృద్ధి పథాన నడిపిస్తా
‘సాక్షి’తో నందిగామ వైఎస్సార్ సీపీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు
రాజకీయాలకు
అతీతంగా..
స్వచ్ఛ నందిగామ లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక
వీటిపై ఫోకస్
నందిగామ రూరల్: నందిగామ పట్టణాభివృద్ధికి శక్తివంచన లేకుండా కష్టపడతానని వైఎస్సార్ సీపీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు తెలిపారు. వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలు విభాగాలలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ అరుణకుమార్ సహకారంతో నందిగామ పట్టణ భవిష్యత్తు, అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రత్యేక ప్రణాళికలు, ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకొస్తున్నానని చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అందుకే రాజకీయాల్లోకి..
వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా నాకు రోల్ మోడల్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజా సేవ చేయాలనే కోరికతోనే చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మా కుటుంబం తరాలుగా సంఘ సేవకుపునరంకితమైంది. సేవా కార్యక్రమాల్లో భాగంగానే మా నాన్న చల్లా సంగమేశ్వరరావు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చల్లా సంగయ్యగా మంచి గుర్తింపు ఉంది. నా భార్య అనురాధ గృహిణి కాగా కుమారులు మంజునాథ్, ధీరజ్ బీటెక్ అభ్యసిస్తున్నారు.
సమన్యాయం ఇక్కడే సాధ్యం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తుంది. కమ్మ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు మునిసిపల్ చైర్మన్‌గా అవకాశం కల్పించింది. నందిగామ చరిత్రలో దశాబ్దాల తరువాత తిరిగి వ్యాపార వర్గాలైన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ముస్లింలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కాపులకు సొసైటీ చైర్మన్ వంటి అవకాశాలిచ్చింది ఒక్క వైఎస్సార్ సీపీనే.
ప్రణాళిక ప్రకారం..
పట్టణంలోని పాత బైపాస్ రోడ్డు అభివృద్ధి, ఎన్‌ఎస్పీ కెనాల్‌ను వాక్‌వేగా అభివృద్ధి, ఒకప్పుడు విద్యా కేంద్రంగా ఉండటమే కాకుండా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కేవీఆర్ కళాశాలకు పూర్వ వైభవం, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే క్రమంలో మునేటిపై చెక్ డ్యాం ఏర్పాటు, సిద్ధార్థ నగర్ (పాత హరిజన వాడ) డ్రెయిన్‌పై శ్లాబ్ నిర్మించి వాక్‌వేగా మార్చుతా, పార్కులు ఏర్పాటుకు చేస్తా.
అధికారంలోకి రాగానే..
ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే మునిసిపల్ చైర్మన్‌గా పట్టణంలోని చెరువు బజారు, భారత్ టాకీస్ ప్రాంతాలలో దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని పట్టాలను పంపిణీ చేస్తా. డీవీఆర్ కాలనీలో ప్రాంతంలోని మూడు కాలనీలకు ప్రహరీ నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేస్తా.
ఏ పట్టణంలోనైనా రోడ్లు, డ్రెయిన్‌లు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సమస్యలే కనిపిస్తుంటాయి. వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమల స్థాపన, తదితర ఆదాయ వనరులను కల్పించి పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా.
ఎన్నికల వరకే రాజకీయాలు. గెలిచిన తరువాత నందిగామ పట్టణ ప్రజలందరికీ నేను చైర్మన్‌ను. విభేదాలకు తావు లేదు. పార్టీలకతీతంగా అర్హులందరికీ మంచి చేయటమే మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా.
పట్టణంలోని చెత్తను సేకరించి ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంది. కానీ రెండు, మూడు రోజులకొకసారి తరలిస్తున్నారు. దీంతో వీధులన్నీ చెత్తతో దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది కొరత కూడా ఒక కారణం. మేము అధికారంలోకి రాగానే పారిశుద్ధ్య సిబ్బందిని పెంచటంతో పాటు ప్రతిరోజూ చెత్తను తరలించేలా చూస్తాం. చెత్త డంపింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తాం. గతం ప్రభుత్వంలోనే పట్టణంలో నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా అవసరమైన డ్రెయిన్‌లను నిర్మించారు. ఇక బస్టాండ్ వెనుక, కుమ్మరి బజారు, తదితర లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరుతోంది. ఆ ప్రాంతాలలో సైతం సమస్య పరిష్కారానికి కృషి చేస్తా
చిరు వ్యాపారులకు అండగా..
చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు రోడ్డుపైనే వ్యాపారాలు సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. జనసంచార ప్రాంతాల్లోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు సాగించుకునే మార్గాలనే అన్వేషించి.. పార్కింగ్, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తా.


