కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలనలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్న అన్ని నామినేషన్లను ఆమోదించాలన్నారు. ఎన్నికల హ్యాండ్ బుక్‌లోని నిబంధనలు, పేర్కొన్న అంశాలు తప్పనిసరిగా షరతులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అభ్యర్థుల పేర్లలో అక్షర దోషాలు, చిన్న, చిన్న పొరపాట్లు ఉన్నా నామినేషన్లను తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. ఏదైనా నామినేషన్ తిరస్కరించాల్సి వస్తే ఎన్నికల హ్యాండ్ బుక్‌లో పేర్కొన్న నిబంధనల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక అభ్యర్థి రెండు వేరే వేరే ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఒక ఎంపీటీసీ స్థానానికి అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేస్తే వాటిలో కనీసం ఒక నామినేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటే మిగిలిన సెట్ల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. పోటీ చేసే అభ్యర్థి ప్రభుత్వ సంస్థలో నామినేటెడ్ పోస్టులో కొనసాగితే సంబంధిత చట్టాలు, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ పదవికి రాజీనామా చేసి ఆమోదింప జేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి పాల్గొన్నారు.


