ఆదిలాబాద్‌రూరల్: రాజర్షిషా గూడను అన్ని వసతులతో జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పిప్పల్‌దరి పంచాయతీ ప రిధిలోని రాజర్షి షా గూడలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. తన పేరును గ్రామానికి పెట్టినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపా రు. అనంతరం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ క్రాంతి కుమార్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్, డీఎంహెచ్‌వో సాధన, సంక్షేమ శాఖల అధికారులు మనోహర్, సునిత కుమారి, తహసీల్దార్ గోవింద్, సర్పంచ్ లక్ష్మిబాయి, తదితరులున్నారు.
జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
ఆదిలాబాద్: జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణవాడ బొజ్జావార్ ఆలయం, దుర్గానగర్‌లోని నవశక్తి దుర్గా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. దుర్గానగర్ ఆలయంలో అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ వేణు, పూజారులు కిషన్, భక్తులు పాల్గొన్నారు.
కరపత్రం విడుదల
కై లాస్‌నగర్: సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా వేడుకలకు సంబంధించిన కరపత్రంను కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఇందులో వేద పండితులు సంతోష్ శర్మ, సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్‌ఖత్రి, రేణికుంట రవీందర్, కందుల రవీందర్, మహిపాల్, సుభాష్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


