బోథ్: సొనాల మండల పరిధిలోని చింతలబోరి, అజ్జర్ వజ్జర్ అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. దేవులనాయక్ తండాకు చెందిన రైతు రాథోడ్ వసంత్‌కు చెందిన ఆవును, ఫూల్‌సింగ్ నాయక్ తండా గ్రామానికి చెందిన ఆడె కిశోర్‌కు చెందిన దూడను హతమార్చిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. గ్రామం నుంచి ఇద్దరు కాపరులు రాథోడ్ మఖూన్, రాథోడ్ రవి రోజు మాదిరిగా శనివారం మేత కోసం పశువులను అడవికి తీసుకెళ్లారు. అవి మేస్తుండగా పొదల మాటున ఉన్న పులి ఒక్కసారిగా వాటిపై దాడి చేసింది. పశువుల అరుపులతో అప్రమత్తమైన కాపారులు కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆవు, దూడ చనిపోయాయి. విషయాన్ని కాపరులు వెంటనే గ్రామస్తులకు తెలిపారు. వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. బోథ్ ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో కవిత ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం పులి దాడిలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. బెబ్బులి కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అడవిలో ట్రాప్ కెమెరాలను అమర్చినట్లు పేర్కొన్నారు. బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పులి సంచారం దృష్ట్యా అటవీ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


