అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటికిటలాడుతున్నాయి. శుక్రవారం రాఖీ పౌర్ణమి కావడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో వివిధ రంగులు, డిజైన్లలో రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. ముత్యాలు, రుద్రాక్షలు, రంగురాళ్లు, జర్దోసి, మెటల్ అలంకరణలతో రూపొందించిన, దేవతామూర్తుల చిత్రాలతో కూడిన, చిన్నారులను ఆకట్టుకునే కార్టూన్ పాత్రల బొమ్మలతో తయారు చేసిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రాఖీలు రూ.20 నుంచి రూ.300 వరకు లభిస్తుండగా, ముత్యాలు, రాళ్లు, ప్రత్యేక అలంకరణలతో కూడినవి రూ.300 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారు. – ఆదిలాబాద్


