ఇంద్రవెల్లి: మండలంలోని జాలంతాండ దిశ మోడల్ స్కూల్‌లో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు మొత్తం 38 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ గత జనవరిలో పదవీ విరమణ పొందగా...వేరే ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో ఎస్‌జీటీ రామారావ్ ఒక్కడే పాఠశాలలోని 38 మంది విద్యార్థులకు చదువుచెప్పాల్సి రావడంతో పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 38 మంది విద్యార్థులకు ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఎస్‌జీటి ఉపాధ్యాయులు అవసరం ఉండగా...ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో తమ పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఐటీడీఏ పీవో దృష్టి సారించి జాలంతాండ దిశ మోడల్ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


