మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఇక ప్రతీ గ్రామ వివరాలన్నీ కూడా వెబ్‌సైట్‌లో నిక్షిప్తం కానున్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రతీ గ్రామానికి సంబంధించి ప్రస్తుత గ్రామ వివరాలు, మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక, వార్షిక పనులు–ఆర్థిక పురోగతి అనే మూడు అంశాలకు సంబంధించి వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు. మొదటి విభాగంలో ప్రస్తుతం గ్రామ జనాభా, వ్యవసాయ, ఉద్యానవనం, నీటి వనరులు, సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, నీటి సంరక్షణ, భూములు, వాతావరణ పరిస్థితులు, ఆదాయ, వ్యయాలు, పెన్షన్‌లు, వన మహోత్సవం, వీబీజీ–రామ్‌జీ, సీ్త్రనిధి, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక ఇలా..
2026 నుంచి 2029 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడేళ్ల ప్రణాళిక తయారు చేస్తారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛభారత్ మిషన్ భగీరథ, మహిళా సాధికారత, సీ్త్రనిధితో పాటు జీపీ అభివృద్ధికి అవసరమైన అంచనా బడ్జెట్‌కు సంబంధించి నివేదిక తయారు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
నందులపల్లె ఎంపిక..
గ్రామానికో వెబ్‌సైట్ కార్యక్రమం ఈనెల 21న శుక్రవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభం కా నుంది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో మొదటి దశలో నెన్నెల మండలంలోని నందులపల్లె ఎంపికై ంది. ఈ నెలాఖరు వరకు నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి విడతల వారీగా జిల్లాలోని గ్రామాలన్నింటి సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు.
అందుబాటులో సమగ్ర నివేదిక..
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో గ్రామ పంచాయతీ వివరాలు, మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక, వార్షిక పనులు, ఆర్థిక పురోగతికి సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. మొదటి విడతలో నందులపల్లె వివరాలను ఆన్‌లైన్ చేశాం. దశల వారీగా జిల్లాలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి నివేదిక ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
– కిషన్, డీఆర్‌డీఓ, ఇన్‌చార్జి డీపీఓ, మంచిర్యాల


