ఇతర రాష్ట్రాల వాహనాలను జిల్లాకు తెచ్చి.. ఇంజిన్, రిజిస్ట్రేషన్ నంబర్ల ఫోర్జరీతో అక్రమ దందా తుక్కు పత్రాలకు చట్టబద్ధమైన ముసుగేస్తున్న కేటుగాళ్లు స్క్రాప్ వివరాలను, వేరే వాహనాలకు అమర్చుతున్న వైనం
వరుస తనిఖీల్లో వెలుగుచూసిన ఘటనలు..
బోథ్: ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి చట్టబద్ధమైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అతి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసి వాటికి తెలంగాణలో స్క్రాప్‌గా మారిన లేదా తీవ్ర ప్రమాదాల్లో ధ్వంసమై కదల్లేని స్థితిలో ఉన్న పాత వాహనాల నంబర్లు, ఛాసిస్, ఇంజిన్ వివరాలను అమర్చుతున్న భారీ అక్రమ నెట్‌వర్క్ జిల్లాలో కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి దొంగిలించిన లేదా పత్రాల్లేని వాహనాలను సరిహద్దులు దాటించి తెస్తు న్న కేటుగాళ్లు, ఇక్కడి స్క్రాప్ వాహనాల ఆర్సీపత్రా ల ఆధారంగా నకిలీ గుర్తింపును సృష్టించి దర్జాగా రోడ్లపై తిప్పుతున్నారు. ఇటీవల పోలీసుల వరుస తనిఖీల్లో పట్టుబడుతున్న వాహనాలు ఈ ముఠాల పక్కా పన్నాగాలను బహిర్గతం చేస్తున్నాయి.
అక్రమదందా సాగుతున్న తీరు ఇలా..
ఈ ముఠాలు ప్రధానంగా రెండు మార్గాల్లో వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. మొదటిది మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో లభించే పత్రాల్లేని సెకండ్ హ్యాండ్ వాహనాలు, దొంగిలించిన బైకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. రెండోది తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో పూర్తిగా దెబ్బతిని తుక్కుగా మారిన లేదా ఇంజిన్ పాడై నిరుపయోగంగా పడి ఉన్న పాత వాహనాల ఆర్సీ పత్రాలు, నంబర్లను స్క్రాప్ వ్యాపారుల నుంచి రూ.5వేల నుంచి రూ.10వేలకు తీసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానిక మెకానిక్‌లు, వెల్డర్లతో కుమ్మకై ్క పరాయి రాష్ట్ర వాహనంపై ఉన్న అసలు ఛాసిస్, ఇంజిన్ నంబర్లను గ్రైండింగ్ మెషీన్ల ద్వారా పూర్తిగా చెరిపివేస్తున్నారు. వాటి స్థానంలో ఇక్కడి పాత స్క్రాప్ వాహనం తాలూకు వివరాలను డై–పంచ్, ప్రత్యేక వెల్డింగ్ సాంకేతికతతో కొత్తగా ముద్రిస్తున్నారు. అనంతరం పాత నంబర్ ప్లేట్‌ను తగిలించి, దానికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలు జతచేసి, పూర్తి చట్టబద్ధమైన స్థానిక వాహనంగా భ్రమింపజేస్తూ మార్కెట్లో అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం నంబర్‌ప్లేట్, ఆర్సీ కార్డు మాత్రమే చూసి మోసపోవద్దని పోలీసు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనం బాడీ పై ముద్రించి ఉన్న ఛాసిస్, ఇంజన్ నంబర్లను నిశి తంగా గమనించాలని, అక్కడ గ్రైండింగ్, వెల్డింగ్ గుర్తులు ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని పే ర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘పరివాహన్’ పోర్ట ల్ ద్వారా ఆన్‌లైన్ డేటాతో చాసిస్ నంబర్ సరిపోలుతుందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే లావాదేవీలు జరపాలని స్పష్టం చేస్తున్నారు. మోటారు వా హనాల చట్టం ప్రకారం చాసిస్ నంబర్లను మా ర్చడం, నకిలీ పత్రాలను సృష్టించడం నాన్‌బెయిలబుల్ నేరమని, ఇటువంటి ఫోర్జరీలకు పాల్పడే వారిపై చీటింగ్ కేసులతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
నకిలీ నంబర్ ప్లేట్‌తో బైక్ పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్: నకిలీనంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునిల్ కుమార్ తెలిపారు. ఈనెల 12న రాత్రి పట్టణంలో వాహన తనిఖీలు చేస్తుండగా పల్సర్ బైక్‌పై వచ్చిన వ్యక్తి ఎలాంటి పత్రాలు చూపించలేదని, ఆన్‌లైన్‌లో వాహనం వివరాలు పరిశీలించగా, బైక్‌పై ఉన్న ఇంజిన్, చాసిస్ నంబర్లకు తేడా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాహనదారుడిని ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ అర్బాస్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం ఇచ్చోడలోని రెడ్డి కాలనీకి చెందిన పుసపత్రి కృష్ణ వద్ద బైక్‌ను తాకట్టు పెట్టినట్లు అర్బాస్ తెలిపాడు. అయితే కృష్ణ తన సోదరుడి బైక్ నంబర్ ప్లేట్‌ను ఈ వాహనానికి అమర్చాడు. ఈ క్రమంలో తప్పుడు నంబర్ ప్లేట్‌తో వాహనం నడుపుతున్న షేక్ అర్బాస్‌తో పాటు నంబర్ ప్లేట్ మార్చిన కృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
వాహనాలు కొనేముందు సరిచూసుకోవాలి
సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు చాసిస్, ఇంజన్ నంబర్లను భౌతికంగా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఒరిజినల్ ఆర్సీ పత్రాలను సరిచూసుకున్న తర్వాతే నగదు చెల్లించాలి. నంబర్లు చెరిపివేసిన వాహనాలను కొని మోసపోవద్దు. నంబర్లు మార్చే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
– జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్


