జాబితాలో ఉన్నా.. నోటీసులు అనామలిస్‌లో లక్షకు పైగా ఓట్లు నో మ్యాపింగ్‌లో వేలల్లో.. గడువులోపు ఆధారాలు సమర్పించాల్సిందే ‘ముసాయిదా’ విడుదల తర్వాత పరిస్థితి
సాక్షి,ఆదిలాబాద్: ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితా విడుదలైంది. అందులో తమ పేరు ఉంటుందా.. లేదా అనేదానిపై అందరూ ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పుడు జాబితాలో వివరాలు వెతుక్కుంటున్నారు. కొంత మంది ఇప్పటికే వాటిని చూసేశారు. ఈ జాబితాలో ఉండడంతో ఇక తమ ఓటుకు ఏమి కాదనుకుంటే పొరపాటే. ఎన్నికల సంఘం ఈ జాబితాలో ఉన్నవారికి కూడా వివిధ కారణాలతో ఈఆర్‌వో ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. ఆ నోటీసు అందుకున్న వారు నిర్దేశిత సమయంలో ఎలాంటి ఆధారం సమర్పించకపోయినా, వెరిఫికేషన్ పూర్తి చేసుకోకపోయినా తుది ఓటరు జాబితా నుంచి తొలగింపునకు గురయ్యే అవకాశం ఉంది.
ఇదీ పరిస్థితి..
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి ఇచ్చినప్పటికీ పొరపాట్లు, ఇతర కారణాలతో అనేక మంది ఓటర్లను అనామలిస్ కేటగిరీలో చేర్చడం జరిగింది. ఇలా లక్షకు పైగా ఓటర్లు ఉండటం గమనార్హం. ఇప్పుడు వారందరికీ ఈఆర్‌ఓ నుంచి నోటీసులు జారీ చేయనున్నారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపే సమయంలో బీఎల్‌వోలు పాత ఓటర్ల జాబితా ఆధారాలతో ప్రస్తుత ఓటరు కార్డు వివరాలను లింక్ (మ్యాపింగ్) చేస్తారు. ఒకవేళ ఓటరు నమోదు డేటా సరిగ్గా మ్యాచ్ కానట్లయితే వారిని నో మ్యాపింగ్ వర్గంలో చేరుస్తారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్నప్పటికీ ఈ రెండు కేటగిరీల్లో పలువురు ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇతర అంశాల ఆధారంగా ఇప్పటికే వేలాది ఓట్లు తొలగింపునకు గురైన విషయం తెలిసిందే.
వివరాలు
జూన్ నాటికి ఓటర్ల సంఖ్య : 4,66,784
డిజిటలైజేషన్ పూర్తయింది : 4,03,625
అనామలిస్ నోటీసులు : 1,32,833
మ్యాపింగ్ కానివారు : 17,591
శాశ్వతంగా తొలగించిన ఓట్లు : 63,159


