కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాల నీ, సర్వేనంబర్ 170లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం లక్కీడ్రా నిర్వహించారు. అయి తే ఈ ప్రక్రియ కౌన్సిలర్ల అభ్యంతరాలు, ఆందోళనలు, విజ్ఞప్తుల నడుమ ముగిసింది. కలెక్టర్ రాజర్షిషా ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి చేపట్టారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ, 337 ఇళ్లకు గాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి నుంచి 1032 దరఖాస్తులు అందినట్లుగా తెలిపారు. గతంలో పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 618 ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో 488 మంది అర్హులుగా తేలరన్నారు. మరో 16 వార్డులకు 109 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 48 ఇళ్లను రిజర్వ్‌లో ఉంచి 337 ఇళ్లకు ప్రస్తుతం లక్కీడ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను 49 వార్డుల నుంచి అందిన దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందులో హౌసింగ్ పీడీ రెడ్డి శంకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఆర్‌ఐ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ల అభ్యంతరం..
అయితే దరఖాస్తుల ఆధారంగా ఇళ్ల కేటాయింపు సరికాదంటూ అధికార కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కౌన్సిలర్లు మాత్రం అలాగే డ్రా నిర్వహించాలని పట్టుబట్టారు. ఇలా పరస్పర డిమాండ్లతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. దీంతో అదనపు కలెక్టర్ జోక్యం చేసుకుని ఏ విధానంలో డ్రా నిర్వహించాలనే దానిపై కౌన్సిలర్ల అభిప్రాయం కోరుతూ సంతకాలు సేకరించారు. 22 మంది అన్ని వార్డులకు సమానంగా డ్రా తీయలని కోరగా మిగతా వారు మాత్రం దరఖాస్తుల సంఖ్యకనుగుణంగానే చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో మళ్లీ రభస మొదలైంది. పలువురు కౌన్సిలర్లు అదనపు కలెక్టర్‌ను చుట్టుముట్టి అన్ని వార్డులకు సమానంగా ఇళ్లను కేటాయించాలంటూ పట్టుబట్టారు. ఎంతకీ తగ్గకపోవడంతో అదనపు కలెక్టర్.. కలెక్టర్‌తో వేరుగా చర్చించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ఇళ్ల పంపిణీ ఆలస్యమైందన్నారు. జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేద్దామని, సహకరిస్తే పేదలకు న్యాయం జరుగుతుందని అర్థం చేసుకోవాలంటూ కౌన్సిలర్లను కోరారు. రెండు విధానాలు కాకుండా 1,032 మందితో నేరుగా లక్కీ డ్రా తీద్దామని వచ్చినవారు ‘డ్యాన్స్ చేస్తారని, రానివారు ఏడుస్తారంటూ’ పేర్కొన్నారు. దీంతో చల్లబడ్డ కౌన్సిలర్లు అన్ని వార్డులకు సమానంగా వచ్చేలా డ్రా నిర్వహించేందుకు అంగీకరించారు. దీంతో ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. నాలుగు గంటలకు సమావేశం మొదలు కాగా రాత్రి 7.30గంటలకు ముగియడం పరిస్థితికి అద్దం పడుతుంది.
ర్యాండమైజేషన్ ద్వారా..
అనంతరం 46 వార్డులకు ఏడు చొప్పున మూడు ఇళ్లకు తక్కువ దరఖాస్తులు రావడంతో వచ్చిన దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికై న వారి జాబితాను మున్సిపల్, కలెక్టర్ కార్యాలయాల నోటీసుబోర్డుపై ఉంచనున్నట్లుగా తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. గతంలో ఎంపికై న లబ్ధిదారులతో పాటు 337మందిని కలిపి అందరికి జూన్ 2లోగా ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు.


