నువ్వు రైతు అభివృద్ధి లక్ష్యంగా సాగు
డ్రోన్ ద్వారానే విత్తనాలు, ఎరువులు
దేశంలోనే తొలిసారిగా పొన్నారిలో శ్రీకారం
కోత దశకు పంట.. ఇటీవల పరిశీలించిన కలెక్టర్
తాంసి: కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సాయినాథ్‌కు చెందిన ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ సహకారంతో మండలంలోని పొన్నారి శివారులో జనవరిలో డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లి నువ్వు సాగు చేపట్టారు. జగిత్యాల అగ్రికల్చర్ కళాశాలకు చెందిన జేసీఎస్ 1020 రకానికి చెందిన విత్తనాలను డ్రోన్ ద్వారా విత్తారు. సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్ల ఉండేలా 10 నిమిషాల్లోనే విత్తన ప్రక్రియ పూర్తి చేశారు. కలుపు, పురుగు మందులను సైతం కూలీల అవసరం లేకుండా డ్రోన్ ద్వారా పిచికారీ చేశారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి సైతం ఆశించిన విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానంలో ఎకరం సాగుకు కేవలం రూ.800 మాత్రమే ఖర్చవుతుండగా విత్తనం వేసే సమయం కూడా ఆదా అవుతుంది. అదే సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే రూ.1400కు పైగా పెట్టుబడి వ్యయంతో పాటు విత్తనం వేయడం ఒక రోజు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణ పద్ధతిలో దిగుబడి 3నుంచి 4 క్వింటాళ్లు వస్తుండగా, ఈ విధానంలో 4 నుంచి 5క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
పెట్టుబడి తక్కువ.. సమయం ఆదా
కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో ఎకరంలో సాగు చేస్తున్న. డ్రోన్‌తో పది నిమిషాల్ల్లోనే విత్తనాలు విత్తడం పూర్తయింది. అదే కూలీలతో అయితే ఒక రోజు పట్టేది. గడ్డిమందు, పురుగుమందు కూడా డ్రోన్‌తోనే రెండు సార్లు పిచికారీ చేసినం. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మామూలు విధానంతో పోల్చితే పెట్టుబడి తక్కువ. అలాగే దిగుబడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నన్ను గైడ్ చేస్తున్నారు.
– కేమ సాయినాథ్, రైతు
రైతులకు సాగులో డ్రోన్ టెక్నాలజీ అందించాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ విధానం చేపట్టాం. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ద్వారా నువ్వు విత్తనాలు వేసి సాగు చేస్తున్నాం. సాధారణ సాగుకు ఈ విధానానికి తేడా కనిపిస్తుంది. ఎకరానికి మామూలుగా రూ.1400 పెట్టుబడి అవుతుండగా.. ఈవిధానంలో రూ.800 దాటదు. విత్తనం వేసే సమయం కూడా తక్కువే. దిగుబడి సాధారణ సాగుతో పోల్చితే 25శాతం వరకు అధికంగా ఉంటుంది. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– రాంగోపాల్‌వర్మ, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్


