ఈ కార్యాలయంలో ఇటీవల వందలాది ప్లాట్లకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఓ సబ్ రిజిస్ట్రార్ ఇందులో కీలక భాగస్వామ్యం వహించినట్లుగా ప్రచారం నడుస్తోంది. పట్టణంలోని భాగ్యనగర్, భీంసరి, సీసీఐ ఏరియాలోని వందలాది ప్లాట్ల కు సంబంధించి ఇది వరకు లింకు డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేశారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు కీలకంగా వ్యవహరించి సబ్ రిజిస్ట్రార్‌ను మచ్చిక చేసుకుని వ్యవహరం సాగించారని చెప్పుకుంటున్నారు. ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అధికా రులకు ముట్టజెప్పినట్లుగా ప్రచారం ఉంది.
ఆగని తంతు..
ప్రభుత్వం నుంచి నిషేధం ఉన్నప్పటికీ గతేడాది అనధికారిక లేఅవుట్లలో ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ సమయంలో డీఆర్‌గా ఉన్న ప్రస న్న దీనిపై డీఐజీకి రిపోర్టు అందజేశారు. ఇక ఆ సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తప్పవని అంతా భావించినప్పటికీ కేవలం మరో చోటకు బదిలీకే పరిమితమ య్యారు. ఆ తర్వాత కూడా పలు ప్లాట్లను ఇలాగే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్కెచ్ రెడీ చేయగా ‘సాక్షి’లో కథనం రావడంతో బ్రేక్ పడింది. తర్వాత విజిలెన్స్ దాడులు కలకలం రేపాయి. కొద్ది రోజుల పాటు అక్రమాలకు దూరంగా ఉన్నా ఇటీవల మళ్లీ అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. మొత్తంగా ఆదిలాబాద్ ఎస్‌ఆర్‌వోలో అడపా, దడపా వందలాది ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ దళారులు తమ దందా సాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు మామూళ్లకు ఆశపడి పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకుని వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంలో పట్టిపట్టనట్లుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
నా దృష్టికి రాలేదు..
లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు ఉంటే డీఆర్ కార్యాలయంలో అందజేయాలి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఆదిలాబాద్ ఎస్‌ఆర్‌వో కార్యాలయంలో ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. ఆధారాలు అందజేస్తే విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా జరిగి ఉంటే డీఐజీకి రిపోర్టు అందజేస్తాం. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– ఎం.రవీందర్‌రావు, జిల్లా రిజిస్ట్రార్


