ఆదిలాబాద్: పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందినప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక, విద్యా వారోత్సవాల్లో భాగంగా బాలకేంద్రంలో శనివారం కళలు, హస్తకళల ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. బాలకేంద్రంలో మరిన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తామన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులు తబలా, హా ర్మోనియం వాయించడంతో పాటు ఆయా పాటల పై నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్, విద్యాశాఖ అధికారులు అజయ్, లక్ష్మణ్, బాలకేంద్రం నిర్వహకులు మిట్టు రవి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


